పాత బుకీలు.. కొత్తగా బెట్టింగులు!
- NVS PRASAD
- Apr 15
- 2 min read

సిండికేట్‌గా మారి దండుకుంటున్న 11 మంది
విశాఖ నుంచి శ్రీకాకుళానికి బెట్టింగ్ యాప్ లైన్
దాన్ని గ్రామాల వరకు చేర్చి యువతపై ఆశల వల
బెట్టింగులతో భారీగా నష్టపోతున్న జిల్లా జనం
ప్రస్తుత ఐపీఎల్ సీజను ముగిసేలోగా మరెందరు మునిగిపోతారో?
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారన్న కారణంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో బెట్టింగ్ అనే జూదాన్ని వ్యవస్థీకృతం చేసినవారిని ఏం చేయాలి?
శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలో ఆరో తరగతి చదువుతున్న కుర్రాడు సైతం బెట్టింగ్ యాప్‌లలో పాయింట్లు కొనుగోలు చేస్తుంటే.. వాటిని గ్రామస్థాయికి చేర్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి చుక్కలు చూపించింది. తాజాగా శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆకతాయిలు అల్లరి చేష్టలకు పాల్పడితే నేరుగా తనకు ఫోన్ చేయండంటూ ప్రకటించారు. ఇంత జరుగుతున్నా క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులపై మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్ యాప్‌లతో బుకీలు రెచ్చిపోతున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి అనధికారిక బెట్టింగ్ యాప్‌లను రన్ చేస్తూ పాత బుకీలు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి సరికొత్త ఎత్తుగడతో పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు. శ్రీకాకుళం నగరంలో 11 మంది బుకీలు సిండికేట్‌గా ఏర్పడి విశాఖపట్నం నుంచి అరువు తెచ్చుకున్న అనధికారిక బెట్టింగ్ యాప్‌లతో లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. ఇక్కడి బుకీకి డబ్బులివ్వడం, గెలిస్తే వారి నుంచే సొమ్ములు తీసుకోవడం వంటి పాత సంప్రదాయం ఈ యాప్‌ల వల్ల కనుమరుగైపోయింది. అందుకే యాప్‌లపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించింది. అయితే ప్రచారంలో లేని, అనుమతులు లేని ఐదు యాప్‌లు స్పిన్ ఎక్స్ఛేంజ్, గ్రీన్ డాట్, విన్ ఐపీఎల్, ఎక్స్ఛేంజ్ ఆఫ్ రాధేతో పాటు మరికొన్ని యాప్‌లకు సంబంధించిన ఐడీ, పాస్‌వర్డ్‌లను జిల్లా యువతకు ఇచ్చి, వారి నుంచి లక్షలాది రూపాయలు కొట్టేస్తున్నారు. ఇక్కడ రూపాయికొక పాయింట్ చొప్పున యాప్‌లో కొనుగోలు చేయాలి. ఇలా యాప్‌లు వాడుతున్నప్పుడు బుకీల మధ్య పోటీ ఏర్పడి నష్టపోతున్నారని తేలడంతో నగరానికి చెందిన 11 మంది బుకీలు సిండికేట్‌గా ఏర్పడి, దీన్ని వ్యవస్థీకృతం చేశారు. దాంతో ఎవరు బెట్టింగ్ కాయాలన్నా ఈ 11 మంది దగ్గర నుంచే యాప్ ఐడీ తీసుకోవాలి. వచ్చిన లాభాలను కూడా ఈ 11 మంది పంచుకోవాలి. ఇది ప్రస్తుతం నగరంలో బుకీల మధ్య కుదిరిన ఒప్పందం.
బుకీలు తప్ప బాగుపడ్డవారు లేరు
లాలా, ఇటుకుల రమణ, దేవి, సెహ్వాగ్‌లతో పాటు మరో ఏడుగురు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి సిండికేట్‌గా ఏర్పడి బెట్టింగ్ యాప్‌లను మారుమూల ప్రాంతాలకు కూడా పరిచయం చేస్తున్నారు. వీరందరికీ నరసన్నపేటకు చెందిన ఇద్దరు బుకీలు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నారు. విశాఖపట్నం నుంచి బెట్టింగ్ లైన్‌ను శ్రీకాకుళానికి తెప్పించుకుని పెద్ద ఎత్తున యువకుల నుంచి సొమ్ము కొట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలో బెట్టింగ్ కాసి రూపాయి సంపాదించినవాడు లేడని భోగట్టా. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నందున బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై వివరాలు సేకరించేందుకు స్థానిక డీఎస్పీ కార్యాలయం దగ్గరున్న శేఖర్ అనే బుకీని స్టేషన్‌కు రమ్మని కబురు పెట్టారని, అప్పట్నుంచీ శేఖర్ పరారీలో ఉన్నాడని భోగట్టా. శేఖర్ లేకపోయినా చిన్నబరాటం వీధిలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్న సెహ్వాగ్, దేవీ, లాలా, ఇటుకుల రమణ వంటివారు వ్యవహారాలు చక్కబెడుతున్నారని తెలిసింది. ఈ దందాల కోసమే నగరంలోని మారుమూల ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలాఖరు వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగుతుండగా, మిగిలిన రోజులు ఒక్కో మ్యాచ్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల మీద పందెం కాసి ఓడిపోయినవారే ఎక్కువమంది ఉన్నారు. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఐపీ పెట్టినవారు, ఆత్మహత్య చేసుకున్నవారి వివరాలు బయటపడితే బుకీలు ఎంతవరకు బాగుపడ్డారో తెలుస్తుంది.
Comments