పాత మరకలు.. కొత్త ఉతుకుడు
- NVS PRASAD
- Dec 3, 2024
- 3 min read
ఎచ్చెర్ల ఇన్‌ఛార్జిగా పిన్నింటి పేరు పరిశీలన
జగన్‌ను కలిసిన సాయి
తిలక్, చింతాడ తరహాలోనే ఎచ్చెర్లలో మార్పు
బొత్స, ధర్మానల మద్దతుతో రేసులో ముందు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఒక్కసారి అధికారంలోకి రావడం, ఆ సమయంలోనే ప్రజాప్రతినిధులు కావడంతో కన్నూమిన్నూ కానరాకుండా సామంతరాజుల కంటే ఎక్కువగా ఫీలైపోయి ఐదేళ్లూ పదవి అనుభవించిన వైకాపా నేతలకు ఇప్పుడు కౌంట్‌డౌన్ స్టార్టయింది. 2019`24 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు జనాల్ని పీడిరచడం, సొంత పార్టీ కార్యకర్తలను కూడా వేధించడం, స్థానికంగా అన్ని వ్యాపారాలూ వారే చేసి, భూదందాలు చేయడం వంటి వ్యవహారాలపై అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఉదాశీనంగా వ్యవహరించిన ఫలితంగా 2024లో ఆ పార్టీ ఘోర ఓటమిని రుచిచూసింది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఏమిటో జగన్‌కు తెలిసొచ్చింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పార్టీకి ఫిర్యాదులు వెళ్లినా కనీసం వారిని పిలిచి మందలించే పని కూడా చేయలేదు సరికదా, ఫిర్యాదు చేసినవారిపై కక్ష సాధింపులకు ఆ పార్టీ పూనుకొంది. అధికారంలో ఉన్నప్పుడు ఉపేక్షించినా, గతంలో వచ్చిన ఫిర్యాదుల ఫైళ్లను జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు దులుపుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో అనేకచోట్ల ఇన్‌ఛార్జిల మార్పులకు శ్రీకారం చుట్టారు. టెక్కలి నియోజకవర్గం నుంచి తిలక్, ఆమదాలవలస నియోజకవర్గానికి చింతాడ రవికుమార్‌లను పార్టీ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి కూడా సిటింగ్ ఇన్‌ఛార్జిని మార్చాలని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా రణస్థలం ఎంపీపీ ప్రతినిధి, జిల్లా వైకాపా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్‌ను కొద్ది రోజుల క్రితం వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి పిలిపించుకున్నారు. అనంతరం ఆయన్ను ఎచ్చెర్లకు ఇన్‌ఛార్జిని చేస్తారన్న ప్రచారాలు ఊపందుకున్నాయి. గతంలో తిలక్‌కు, చింతాడ రవికుమార్‌లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చినప్పుడు ‘సత్యం’ కథనాలు ప్రచురించినందున ఇప్పుడు పిన్నింటి సాయి కథా కమామీషును అందిస్తున్నాం.
వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే అప్పటి ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి తెప్పించుకున్న నివేదికల మేరకు కిరణ్ ఓడిపోతారని తేలింది. అదే సమయంలో విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రయోగం చేయడంతో గొర్లె కిరణ్‌కుమార్ గెలిచేస్తారన్న ధీమాతో జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ఆయనకే టిక్కెట్ ప్రకటించారు. ఫలితం అందరికీ తెలిసిందే. వాస్తవానికి 2024 ఎన్నికలసరికే పిన్నింటి సాయి వైకాపా టిక్కెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. స్వయాన గొర్లె కిరణ్‌కుమార్‌కు బావమరిది అయిన పిన్నింటి సాయే ఆయన అభ్యర్థిత్వాన్ని 2024లో వ్యతిరేకించారు. అందుకు కారణం.. గొర్లె కిరణ్‌కుమార్ కొందరివాడిగా మారిపోవడమే. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే, ఈ నాలుగుచోట్లా బలమైన వైకాపా వర్గం గొర్లె కిరణ్‌ను వ్యతిరేకించింది. వైకాపా హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగరేసింది. జగన్ ముద్దు.. కిరణ్‌కుమార్ వద్దు అంటూ రోడ్డెక్కింది. అయితే అప్పట్లో అధిష్టానం దీన్ని సీరియస్‌గా తీసుకోవడం గాని, పిలిపించి మాట్లాడటం గాని చేయలేదు. నాలుగు మండలాల్లో గొర్లె కిరణ్‌కు వ్యతిరేకంగా మెజార్టీ వైకాపా నాయకులు జట్టు కట్టినప్పుడు కూడా పిన్నింటి సాయిని వారెవరూ వ్యతిరేకించలేదు. గొర్లె కిరణ్‌కుమార్‌కు బావమరిది అని ఎక్కడా ఆయన మీద వైకాపా వ్యతిరేక ముద్ర వేయలేదు. ఇప్పుడు అదే పిన్నింటికి కలిసొచ్చింది. 2014, 2019, 2024 వరుసగా మూడు ఎన్నికల్లో వైకాపా గొర్లె కిరణ్‌కుమార్‌కు అవకాశం కల్పిస్తే, ఇందులో 2019లో ఆయన గెలిచారు. ఈ మూడు ఎన్నికల్లోనూ బావ కోసం పిన్నింటి కష్టపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో తన బావమరిది కూడా టిక్కెట్ ఆశిస్తున్నాడని తేలడంతో కిరణ్ ఆయన్ను పక్కన పెట్టినా ఆయన మాత్రం పార్టీ కోసమే పని చేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్‌ను వ్యతిరేకించిన గ్రూపు సాయికి ఇన్‌ఛార్జిగా నియమిస్తామంటే అడ్డు చెప్పదన్న భావనతోనే పార్టీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇది కాకుండా అటు బొత్స, చిన్నశ్రీనుల కుటుంబాలు, ఇటు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ కుటుంబాల ఆశీస్సులు పిన్నింటి సాయికే ఉన్నాయి. 20 ఏళ్ల యువకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి పిన్నింటి సాయి ధర్మాన అనుచరుడిగానే ముద్రపడ్డారు. ఎచ్చెర్ల మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీల మధ్య వివాదం హత్యాయత్నాల వరకు వెళ్లినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్ పిన్నింటి సాయినే కాన్ఫిడెన్షియల్ టీమ్‌లోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్ గెలవడం, అదే సమయంలో శ్రీకాకుళం నుంచి గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి రాకపోవడంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో కొన్ని సమావేశాలకు ధర్మానను పిలవాలన్న ప్రతిపాదన ఉన్నా కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించేవారు కాదన్న విషయం ధర్మాన క్యాంప్ ఆఫీసు వద్ద కూడా ఉంది. ఇక బొత్స కుటుంబంతో కిరణ్‌కుమార్ వైరం స్వయంకృతాపరాధం. ఎచ్చెర్ల నుంచి చిన్నశ్రీను పోటీ చేస్తారన్న భావనతో ఆయన పుట్టినరోజు సందర్భంగా గొర్లె కిరణ్ వ్యతిరేకవర్గం అప్పట్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే, దాన్ని కిరణ్ మనుషులతో చింపించేయడం వంటివి చేశారు. ఫ్లెక్సీలు చింపుతూ కొందరు దొరకడం, వారిని పోలీసులకు అప్పగించడం, ఎచ్చెర్ల ఎంపీపీ మనుషులు చెబితేనే ఈ పనికి ఒప్పుకున్నామని వారు చెప్పడం అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. చిన్నశ్రీనును తమ నెత్తిన రుద్దుతున్నారన్న భావనతో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణను, అప్పటి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను కూడా కిరణ్‌కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు తన నియోజకవర్గంలో శుభకార్యం ఉందంటూ కార్డు ఇచ్చిన తూర్పుకాపులను బొత్స సత్తిబాబును పిలిస్తే తాను రాననే సంకేతాలు కూడా ఇచ్చారని నేరుగా అప్పట్లో సత్తిబాబుకు ఫిర్యాదు చేశారు కూడా. శ్రీకాకుళం నుంచి ధర్మాన కుటుంబాన్ని, విజయనగరం నుంచి బొత్స కుటుంబాన్ని, స్థానికంగా వైకాపా నేతలను దూరం చేసుకున్న కిరణ్‌కుమార్‌కు మూడు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈసారి కొత్తవారికి ఇవ్వాలన్న కోణంలో పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో పిన్నింటి సాయి విజయవాడలో జగన్మోహన్‌రెడ్డిని కలవడం ఈ ఊహలకు బలం చేకూర్చింది. వాస్తవానికి పిన్నింటి సాయికి నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లో పరిచయాలు, మొహమాటాలు, రాకపోకలు ఉన్నాయి. ఈయనకు ఇన్‌ఛార్జిగా ప్రకటిస్తే గొర్లె కిరణ్‌కుమార్ మినహా మరెవరూ అభ్యంతరం చెప్పే అవకాశం కూడా ఉండదు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దకపోవడం వల్లే 11 సీట్లకు పరిమితమైపోయామన్న భావన ఆ పార్టీలో ఉంది. ఇప్పుడు దాన్ని సరిదిద్ది నాలుగున్నరేళ్ల ముందే ఇన్‌ఛార్జిని ప్రకటించడం ద్వారా వ్యక్తిని, పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పిన్నింటి సాయికి నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తారని ఆ పార్టీ చర్చ నడుస్తోంది. సాధారణంగా జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరితోనూ చర్చించరు. ఒకవేళ చర్చించాల్సిన అవసరమొస్తే అటు బొత్స గాని, ఇటు ధర్మాన కాని సాయిని కాదనే ప్రశ్న ఉండదు.
Yorumlar