పేరుకు సర్కారీ ఉద్యోగం.. చేసేది పార్టీ ఊడిగం!
- DV RAMANA
- Apr 14
- 2 min read
ఐసీటీసీ కౌన్సిలర్ రాజకీయ విధులు
అప్పుడూ.. ఇప్పడూ వైకాపా సేవలో తరిస్తున్న ఘనుడు
పలాస ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
రాష్ట్ర కార్యాలయంలో ఉన్న మద్దతే కారణం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. సర్వీస్ రూల్స్ పాటిస్తూ విధులు నిర్వర్తించాల్సిన ఆయన ఉద్యోగాన్ని గాలికొదిలేసి రాజకీయ పార్టీ సేవలో తరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్తగా చెలామణీ అవుతున్నాడు. చిత్రమేమిటంటే గత ఏడాది వరకు అధికారంలో ఉన్న వైకాపాకు కొమ్ముకాసిన ఇతగాడు.. ఆ పార్టీ అధికారం కోల్పోయినా ఇప్పటికీ దాన్నే అంటిపెట్టుకుని ఉంటూ ఉద్యోగానికి ఎగనామం పెడుతున్నాడు. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు ఎమ్మెల్యే లేఖ రాసి నెలలు గడుస్తున్నా దిక్కులేదు. ఉన్నతాధికారులే ఆ రాజకీయ ఉద్యోగిని కాపాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా..

వజ్రపుకొత్తూరు మండలం చినవంక పంచాయతీ పరిధిలోని గుల్లలపాడు గ్రామానికి చెందిన బగాది శ్రీకాంత్ పలాసలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీశాక్స్) విభాగంలో ఐసీటీసీ కౌన్సెలర్ అయిన ఈయన ఆ హోదాలో పలాస సీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్నారు. పేరుకు ఈయన ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆ విధుల కంటే రాజకీయ పార్టీ సేవలోనే ఎక్కువ కాలం గడుపుతుంటారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు అధికారంలో ఉన్న వైకాపా కార్యకర్తగా పనిచేస్తూ విధులకు డుమ్మా కొట్టడం ఈయనకు రివాజుగా మారింది. అప్పట్లో వైకాపా కార్యకర్తలను గ్రామ, వార్డు సచివాలయలకు కన్వీనర్లుగా నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బగాది శ్రీకాంత్ చినవంక గ్రామ సచివాలయ కన్వీనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ హోదాలో ఆయన వైకాపా ఎన్నికలకు ముందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగినన్న విషయాన్ని విస్మరించి రాజకీయ ప్రసంగాలు చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ఈయన గారికి నిత్యకృత్యం. శ్రీకాంత్ అనుచిత వైఖరిపై గతంలోనే వజ్రపుకొత్తూరు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబు చౌదరి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పటికీ అదే తీరు

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి టీడీపీ`జససేన`బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిరది. పలాసలోనూ వైకాపా మంత్రి సీదిరి అప్పలరాజును ఓడిరచి టీడీపీ నాయకురాలు గౌతు శిరీష ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇప్పటికీ ఆయన వైకాపాతోనే అంటకాగుతూ తన ఉద్యోగానికి ద్రోహం చేస్తున్నారని తెలిసింది. అతని తీరుపై అనేకమంది అందించిన సమాచారం, ఆయన చేసిన రాజకీయ ప్రసంగాలపై పత్రిక వచ్చిన వార్తల ఆధారంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా గత ఏడాది నవంబర్ రెండో తేదీన జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిదా ఉండి కూడా సర్వీస్ రూల్స్‌కు భంగం కలిగిస్తూ రాజకీయాలు చేస్తున్న శ్రీకాంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె తన లేఖలో కోరారు. అయితే దీనిపై కూడా ఇంతవరకు స్పందన కనిపించలేదు. దీనిపై చర్యల కోసం కలెక్టర్ ఆ లేఖను డీఎంహెచ్‌వోకు పంపగా.. ఆయన దాన్ని ఏపీ శాక్స్ రాష్ట్ర కార్యాలయానికి అప్పట్లోనే పంపినట్లు తెలిసింది. బగాది శ్రీకాంత్‌కు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పైస్థాయిలో ఉన్న పరిచయాలు, సామాజిక బలమే దీనికి కారణమని స్థానికులు, తోటి ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా అదనపు డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసీ)గా చాన్నాళ్లు పని చేసి ప్రస్తుతం ఏపీశాక్స్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్(బేసిక్ సర్వీసెస్ డివిజన్)గా పని చేస్తున్న వై.కామేశ్వరప్రసాద్ అండదండలు శ్రీకాంత్‌కు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిన్నటివరకు ఏపీశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)గా ఉన్న ఉన్నతాధికారిణి ఈయన సామాజికవర్గానికే చెందినవారు. వీరిద్దరి అండదండలతోనే ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా జిల్లా అధికారులు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments