పోలీసు.. పైలాపచ్చీసు!
- NVS PRASAD
- Mar 20
- 2 min read
ఏసీబీ కానిస్టేబుల్ విపరీత ధోరణి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియా పోస్టులు
ప్రభుత్వ పెద్దలపైనే బూతులు
సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ పోస్టులు
ఏసీబీ విధుల నుంచి తప్పించిన డీజీ
విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్

కొన్నేళ్ల క్రితం వరకు మన పక్కనున్న తమిళనాడుకు మాత్రమే పరిమితమైన ఉద్యోగులు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపే విధానం ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా పాకింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ గత ప్రభుత్వంలో నాయకులకు అనుకూలంగా వ్యవహరించారంటూ అధికారులను, మరీ ముఖ్యంగా పోలీసులతో కుర్చీలాట ఆడటం సాధారణమైపోయింది. అటువంటిది ఏకంగా ఒక రాజకీయ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కొమ్ముకాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు?! వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరించాల్సిన పోలీసులే పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం మాత్రం ఎందుకు చేష్టలుడిగి చూస్తుంది?! వివరాల్లోకి వెళితే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం అవినీతి నిరోధక శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భైరి చంద్రశేఖర్ వైకాపాకు అనుకూలంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ట్రోల్ చేయడం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఈ పోస్టులను కొందరు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న లోకేష్ డీజీపీకి ఫార్వర్డ్ చేయడంతో ఆయన ఏసీబీ డీజీకి వీటిని పంపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల క్రితం భైరి చంద్రశేఖర్‌ను ఏసీబీ నుంచి రిలీవ్ చేసినట్టు భోగట్టా. సైబర్ క్రైమ్‌లో కూడా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారని, ఇది పూర్తయిన తర్వాత భైరి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తారని తెలిసింది. బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉండి మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని, అలాగే మహిళల మార్ఫింగ్ ఫొటోలు, బూతులతో కూడిన ఆయన కామెంట్లను ఇక్కడ షేర్ చేయలేకపోతున్నామని, అకౌంట్ డిలీట్ చేసినా ఐపీ అడ్రస్ ఆధారంగా ఇతని మీద కేసు నమోదు చేయాలంటూ పోలీస్ శాఖను కొందరు కోరడంతో భైరి చంద్రశేఖర్ మీద చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా
2021లో శ్రీకాకుళం ఏసీబీకి వచ్చిన చంద్రశేఖర్ స్వగ్రామం కిల్లిపాలెం. విజయవాడ సిటీ, రూరల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి డిప్యూటేషన్‌పై ఏసీబీకి వచ్చిన చంద్రశేఖర్ ఇప్పటికీ గత ప్రభుత్వానికి అనుకూలంగానే పోస్టులు, ఫొటోలు పెడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ‘మంచోడు మణి’ అనే ఒక అకౌంట్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లు అప్పుడే భయపడుతున్నారు భయ్యో..! అంటూ ఒక పోస్టు పెడితే, ‘ఇప్పుడు ఉండదు, 2029లో ఉంటుంది’ అంటూ చంద్రశేఖర్ చేసిన పోస్టును, అలాగే అప్పటి ఎంపీ నందిగం సురేష్‌తో ఉన్న ఫొటోను లోకేష్‌కు ట్యాగ్ చేశారు. పవన్‌కల్యాణ్ దత్తపుత్రుడు, లోకేష్ ఉత్తపుత్రుడు అంటూ సమ్మలోరి కిల్ల ఒకడు, కమ్మలోరి సిల్లా ఇంకొకడు.. బాబోరి పుత్రులు, రాజకీయ గోచిపాతలు అంటూ కానిస్టేబుల్ భైరి చంద్రశేఖర్ పెట్టడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అలజడి రేగింది. హోంగార్డువా, కానిస్టేబుల్‌వా? అంటూ తెలుగుదేశం అభిమానులు చంద్రశేఖర్‌ను ట్రోల్‌చేసిన పోస్టులతో పాటు అనేక అంశాల మీద ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఫేస్‌బుక్ పోస్టులపై ప్రస్తుతం విచారణ చేపట్టారు. త్వరలోనే చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనూ ఫిర్యాదులు
వాస్తవానికి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందే అనేక ఫిర్యాదులు ఏసీబీ డీజీకి వెళ్లాయి. శ్రీకాకుళంలో ఒక మహిళా వీఆర్వో పై ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన ఈ కానిస్టేబుల్ ఆ నెపంతో తన విధులకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆమె భర్త కొన్నాళ్లు పోరాటం చేశారు. అయితే అప్పటి ప్రభుత్వంలో దీన్ని ఎవరూ పట్టించుకోపోవడంతో చంద్రశేఖర్ ఏసీబీలో కొనసాగుతూ వచ్చారు. ఏసీబీ నుంచి రెండు రోజుల క్రితం ఆయన్ను తప్పించడం వెనుక మహిళా వీఆర్వో భర్త చేసిన ఫిర్యాదే కారణమని అంతా భావించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్ల ఆయనపై విచారణ జరుగుతుందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలో మైన్స్, కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి కూడా మంత్లీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వీటన్నిటి మీద విచారణ జరుగుతుండగా, సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం సోషల్‌మీడియాలో పోస్టులపై ఆధారాలు సేకరిస్తున్నారు.

Comments