బెంగళూరు ఉద్యమం దేశవ్యాప్తం కానుందా?
- DV RAMANA
- Mar 22
- 2 min read

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమనగానే.. మంచి జీతాలు, ఏసీ హాలు, ఖరీదైన కార్లు, అదో దర్జా జీవితమని కొందరు భావిస్తారు. కానీ, వారు కూడా అందరి ఉద్యోగుల్లాగే సమస్యలు ఎదుర్కొంటారని, అర్ధరాత్రి వరకూ ఆఫీసుల్లో పని చేస్తారని, కుటుంబంతో సరదాగా గడిపే సమయం కూడా దొరకదన్న విషయం సమాజంలో చాలా తక్కువ మందికి తెలుసు? ఇప్పుడిదే అంశంపై సాఫ్ట్‌వేర్ రంగంలో రగిలిన ఉద్యమం నేడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కర్నాటకలోని బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా ఉప్పెనలా కదిలారు. ‘మేం మనుషులమే.. కార్పొరేట్లకు బానిసలం కాదంటూ’ రాష్ట్ర రాజధాని ‘ఫ్రీడమ్’ పార్కు వేదికగా ర్యాలీ తీసి నిరసనలు తెలిపారు. వారికి సీఐటీయూ కూడా మద్దతు తెలిపింది. కార్పొరేట్ దిగ్గజాలను నడిపిస్తున్న ప్రైవేటు సంస్థల యజమానులు ఇటీవలి కాలంలో పని గంటల పెంపుపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ఉద్యమం ప్రారంభమవ్వడం ఇక్కడ గమనార్హం. కాలంతో పోటీపడే వాటిల్లో ఐటీ రంగం ఒకటి. హైదరాబాద్, చెన్నైలతో పోల్చుకుంటే బెంగళూర్ టెక్ ఉద్యోగు లకు కేంద్రం. కంపెనీలు కూడా బాగా ఉండటంతో వలసొచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే. ఇది యజమానులకు ఓ వరంగా మారింది. అదిరించి, బెదిరించి పని చేయించుకోవడం అలవాటైంది. వేతనం లేని ఓవర్ టైం డ్యూటీ, అవాస్తవిక డెడ్‌లైన్, అనుకూలించని వాతావరణం వల్ల ఉద్యోగులు, తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అనేక సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడైంది. దీనికితోడు మారిన లైఫ్‌స్టైల్, దీర్ఘకాల ఒత్తిడి, వర్క్‌ప్రెషర్ వల్ల శారీరక, అనారోగ్య సమస్యలతో డెబ్బయి శాతం టెక్కీలు ఇబ్బందులు పడుతున్నారని పలు అధ్యయనాలు తేల్చాయి. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఉద్యోగి హక్కుగా ఉండాలని, అన్ని పరిశ్రమల్లోలాగే ఐటీలో కూడా లేబర్ చట్టాలను అమలు చేయా లని టెక్కీలు రోడ్డెక్కారు. శ్రమను గుర్తించకుండా కార్మికులను, ఉద్యోగులను ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవాలనే విధానం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అందులో ఉద్యోగుల్ని బానిసలుగా చూసే పద్ధతి కూడా బాగా విస్తరించింది. ఎల్‌అండ్‌టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఉద్యోగులు వారంలో డెబ్బయి నుంచి తొంభై గంటలు పనిచేయాలన్నారు. ఓలా ఫౌండర్ విష్ అగర్వాల్ ‘శని, ఆదివారం వారాంతపు సెలవులు అనేది భారతీయ సంస్కృతి కాదు. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. మన సంస్కృతి ప్రకారం నెలకి రెండు రోజులు సెలవుంటే సరిపోతుంది’ అన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ వారానికి తొంభై నుంచి వంద గంటలు పనిచేయాలన్నాడు. మారిన ప్రపంచ రాజకీయ పరిస్థితులు, కేంద్రంలో కార్పొరేట్ల అనుకూల సర్కార్, వ్యాపారాల్లో మితిమీరిన లాభాపేక్ష, వాటి పర్యావసనాలే ఈ బరితెగింపు మాటలన్నది స్పష్టం. అందుకే కారల్ మార్క్స్ పెట్టుబడిలో చెప్పిన ఒక మాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ‘యంత్రాలు విలువను సృష్టించవు. అవి నిర్జీవ శ్రమకు ప్రతిరూపాలు. అవి కూడా గతకాలపు మను షులు చేసినవే. అందులో కూడా శ్రమ నిక్షిప్తమై ఉంది. కానీ ఆ శ్రమకు కొత్తగా అదనంగా చేరేది లేదు. మనిషి సృజనాత్మకతతో లేదా తన కండరాలతో చేసే పనివల్ల ఎప్పటికప్పుడు కొత్త అదనపు విలువను సృష్టిస్తాడు. సజీవ శ్రమవల్లనే విలువ ఉత్పత్తి అవుతుంది. అదనపు ఉత్పత్తికి విలువ సమకూరుతుంది. నిర్జీవ శ్రమవల్ల కాదు.’ అన్నారు. అందుకే కార్పొరేట్ యజమానులకు ఉద్యోగులు మనుషుల్లాగా కనపడ టం లేదు. యంత్రాల్లాగా కనపడుతున్నారు. తమ లాభాల కోసం పనిచేయాల్సిన మిషన్స్‌లా చూస్తు న్నారు. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరం. అసలు కార్మికుడైనా, ఉద్యోగి అయినా రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? అన్న అంశంపై పద్దెనిమిదో శతాబ్దం, పారిశ్రామిక విప్లవం ప్రారంభకాలంలోనే అనేక చర్చలు జరిగాయి. సోషలిస్టు ఉద్యమాలు నడిచాయి. 24 గంటల్లో 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటలు వ్యక్తిగత అవసరాలు, లేదంటే కుటుంబంతో గడిపే సమయంగా విభజించి చివరకు ఎనిమిది గంటల పనిని హక్కుగా పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడు రోజుకు 14 గంటల నుంచి 16 గంటలు పనిచేయాలని ఒత్తిడిచేస్తే వారి శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే ‘పెట్టుబడిదారులు కార్మికులను ఎక్కువ గంటలు పని చేయించడం ద్వారా వాళ్లను మృత్యువుకు దగ్గర చేస్తున్నారు.’ అంటారు మార్క్స్. ఇది ఒక్క సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాదు, ప్రతి రంగంలోనూ దీన్ని జొప్పించే వ్యూహం చాపకింద నీరులా సాగుతున్నది. కార్మిక చట్టాల స్థానంలో మోదీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అమలైతే గనుక రేపు కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అందుకే బెంగ ళూర్‌లో టెక్కీలు చేపట్టిన ఉద్యమం, రేపు దేశమంతా వ్యాపిస్తుందనడంలో సందేహం లేదు.
Comments