బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కోరాలి
- DV RAMANA
- Feb 25
- 2 min read

కర్ణాటక ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో రాయలసీమ ప్రాంతానికి రాబోయే కాలంలో మరణ శాసనాన్ని లిఖించింది. 2014 విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు.. కర్ణాటక, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ వాదనలు గట్టిగా వినిపించలేకపోయారు. ఫలితంగా తప్పుడు నివేదికలను చూపించి అప్పర్ భద్రకు కర్ణాటక ప్రభుత్వం జాతీయ హోదాను సాధించింది. మరి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తుంగభద్ర డ్యామ్‌లో దాదాపుగా 33 టీఎంసీలు పూడిక చేరితే దామాసా పద్ధతిన నష్టపోతున్న మన నీటిని సాధించడానికి తుంగభద్ర సమాంతర కాలువను కూడా జాతీయ ప్రాజెక్టుగా చేయవచ్చుగా. అలా చేయాలని కేంద్రం దగ్గర చంద్రబాబు గాని, జగన్ గాని ఇంతవరకు గట్టిగా మాట్లాడలేదు. దీనితో రాయలసీమ ప్రాంతం త్వరలో ఎడారి కాబోతోంది అన్నది రాయలసీమ ఉద్యమకారుల మనోవేదన. ఈరోజు కోస్తా ప్రాంతంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసింది నాటి యపీఏ ప్రభుత్వం, కర్ణాటకలో అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా చేసింది నేటి ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం ఈ ప్రపంచానికే తెలుసు. కానీ రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతమని మన దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీల నాయకులకు మాత్రం తెలియదు. గుడ్ ఇయర్‌లో వచ్చే భారీ వర్షాలతో కర్ణాటక ప్రాంతం నుంచి తుంగభద్ర, కృష్ణ నదుల వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి మరలించడానికి తుంగభద్ర సమాంతర కాలువ ఆలమట్టి నుంచి బుక్కపట్నం వరకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న వేదవతి, పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని నదుల వరకు వరద కాలవను జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం అవసరం. అదేవిధంగా సిద్దేశ్వరం దగ్గర కల్వకుర్తి నుంచి తిరుపతికి నిర్మించ తలపెట్టిన నేషనల్ హైవేలో భాగంగా కృష్ణానదిపై కేంద్రం ‘తీగల వంతెన’ నిర్మిస్తోంది. అక్కడ తీగల వంతెన వద్దు ‘బ్రిడ్జ్ కం బ్యారేజీ’ నిర్మించి రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు నీళ్లు గ్రావిటీ ద్వారా గుడ్ ఇయర్లో మరలించగలిగితే అమరావతి విజయవాడ ప్రాంతాలకు ముంపు పరిస్థితులు లేకుండా ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ఎన్నో వేదికల ద్వారా ఢల్లీి వరకు కూడా రాయలసీమ ఉద్యమకారులు తమ గళాన్ని వినిపించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్ గానీ, జగన్మోహన్ రెడ్డి గాని, ప్రస్తుతం ముఖ్యమంత్రులు చంద్రబాబు గాని, రేవంత్ రెడ్డి గానీ ‘బ్రిడ్జ్ కం బ్యారేజీ’ నిర్మించి మధ్య కోస్తా ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న విజయవాడ అమరావతి ప్రాంతాలను రక్షించాలని ప్రధాని మోదీని ఏ రోజు కోరడం లేదు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కృష్ణానది ఒడ్డున సమాధి చేస్తున్నారు. ఈ కరకట్టకు పెట్టే డబ్బులను కృష్ణ, తుంగభద్ర నదుల పైభాగాన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలి. వరద జలాలను ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలోకి వదిలే పరిస్థితి ఉత్పన్నమయ్యేటప్పుడు మాత్రమే రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు నిర్మించబోయే ప్రాజెక్టుల ద్వారా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటే తుంగభద్ర సమాంతర కాలువ, బుక్కపట్నం-ఆల్మట్టి వరద కాలువ, గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు, సిద్దేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కం బ్యారేజీలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. దీనికోసం వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అదేవిధంగా కృష్ణానదికి ముఖద్వారం అయిన రాయలసీమ ప్రాంతంలో కాకుండా కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో పెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టులో 102 టీఎంసీల పూడిక చేరడం వల్ల రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు దక్కాల్సిన నికరజలాలు కూడా కృష్ణార్పణం అవుతున్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి గుడ్ ఇయర్లో 500 టిఎంసిలు, ఎనిమిది వందల టీఎంసీలు వృధాగా సముద్రం పాలు అవుతూనే ఉంది. తుంగభద్ర, కృష్ణా నదుల గట్టున ఉన్న రాయలసీమ ప్రాంత రైతాంగం కర్ణాటకకు, కేరళకు, దుబాయ్‌కి మద్రాస్‌కు, హైదరాబాదుకు వలసలు పోవాల్సిన దుస్థితి ఉంది. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతం విషయంలో తమ పార్టీ విధానాలను మార్చుకొని ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించాలి. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటుచేసి, రాయలసీమ ప్రాంతం నుంచి ఏ ఒక్క సంస్థను కూడా ఆ అమరావతికి తరలించకుండా చూడాలి. రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత ఉద్యోగ కల్పన కోసం విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించేలా కేంద్రం మీద వత్తిడి తీసుకువచ్చేందుకు అసెంబ్లీలో చర్చ జరగాలి. అంతేకాదు విభజన చట్టంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల కోసం బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేస్తామన్న పార్లమెంటులోని విభజన చట్టం గురించి అసెంబ్లీలో చర్చించాలి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలతో సమాన అభివృద్ధి జరగడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేయాలి.
Comments