బీరు ‘కొట్టే’స్తున్నఎక్సైజ్ బాబులు!
- NVS PRASAD
- Apr 1
- 2 min read
ప్రభుత్వం తరఫున ఫ్యాక్టరీలో విధులు
నాణ్యత పరిరక్షణ, అక్రమ తరలింపులకే అడ్డుకట్టే బాధ్యత
విధులకే ఎసరు తెస్తూ కొసరు వ్యవహారాలు
తయారయ్యే బీర్ బాటిళ్లను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్న వైనం
అలా తరలిస్తూ హైవే పెట్రోలింగ్‌కు చిక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్
52 హైక్వాలిటీ బీర్ బాటిళ్లు స్వాధీనం

కంచే చేను మేయడం అంటే ఇదే. రక్షించాల్సినవారే భక్షిస్తున్న తీరు విస్మయం గొలుపుతున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. ఆ కర్మాగారంలో తయారైన సరుకు నాణ్యతను, పరిమాణాన్ని పరిశీలించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు వారు. అక్కడ తయారైన సరుకు ప్రభుత్వానికి చేరేలోగా కర్మాగారంలో గానీ, బయటి వ్యక్తులు గానీ వాటిని దారి తప్పించి బహిరంగ మార్కెట్‌లోకి తీసుకుపోకుండా చూడాల్సిన బాధ్యత వారిది. కానీ వారే స్వయంగా దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రణస్థలం మండలం బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్ బ్రేవరీస్‌లో ఉత్పత్తి చేస్తున్న బీరుతో నిండిన బాటిళ్లను ఫ్యాక్టరీ నుంచి అక్రమంగా తరలిస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్ పోలీసులకు దొరికిపోయారు. బంటుపల్లి బీరు ఫ్యాక్టరీలో ప్రభుత్వ ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఫ్యాక్టరీలో విధులు ముగించుకొని తన స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో హైవే పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న జేఆర్‌పురం పోలీసులకు దొరికిపోయారు. ఆయన వద్ద 52 బీరుబాటిల్స్ (కింగ్‌ఫిషర్ స్ల్పెండిడ్ స్ట్రాంగ్ బీర్) లభించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంటుపల్లి ఫ్యాక్టరీలో కింగ్‌ఫిషర్ బీర్లే తయారవుతుండటం విశేషం.
అక్కడ పట్టించోకోకున్నా.. ఇక్కడ పట్టుబడ్డారు
ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే బీర్ల నాణ్యత, పరిమాణాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు సీఐలు, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ ఏసీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఇద్దరు సీఐలు వారంలో సగం రోజులు ఒకరు, మిగిలిన సగం రోజులు ఇంకొకరు చొప్పున డ్యూటీ సర్దుకుంటున్నారు. దీనివల్ల ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై పర్యవేక్షణ కొరవడిరది. కొందరు సుదీర్ఘ కాలంగా ఇదే బీరు ఫ్యాక్టరీలో ఎక్సైజ్ తరఫున కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం బీరు బాటిళ్లు ఇక్కడి నుంచి తీసుకుపోవడం సాధారణమేనంటున్నారు. అడిగితే లేనిపోని కొర్రీలు పెడతారన్న భయంతో బీరు తయారీ సంస్థ అధికారులు ఇన్నాళ్లూ చూసీచూడనట్లు వ్యవహరించారు. అయితే సోమవారం రాత్రి కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్ తన యమహా ద్విచక్ర వాహనంపై రెండు సంచుల్లో 52 బీరుబాటిళ్లు తీసుకెళుతూ హైవేలో తాజ్ పెట్రోల్‌బంక్ వద్ద పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాడు. ఒక్కో బీరు బాటిల్ ఖరీదు మార్కెట్‌లో రూ.650 ఉంది. వీటిని విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో యూబీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లే లారీల వద్ద లోడుకు ఇంత అని వసూలు చేసేవారు. గత కొంతకాలంగా యూబీ యాజమాన్యం దీన్ని కట్టడి చేసేసింది. ఫ్యాక్టరీలో మంచి భోజనం, ఉండటానికి ఏసీ గదులు ఇస్తాం తప్ప లారీ నుంచి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసిన తర్వాత బీరు బాటిళ్ల తరలింపు పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇక్కడ బీరు తయారీకి ఉపయోగించే రసాయనాలకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రస్తుతం ఈ అంశం ఎక్సైజ్ కమిషనరేట్‌లో పెండిరగ్‌లో ఉంది.
Comments