‘కసి’ తీరా భార్యనే నరికేశాడు..!
- BAGADI NARAYANARAO
- Mar 18
- 1 min read
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

(సత్యంన్యూస్, ఎచ్చెర్ల)
సంతసీతారాంపురం (ఎస్‌ఎస్‌ఆర్ పురం) గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కత్తితో నరికి హతమార్చాడు. హత్య చేసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు హత్యకు వినియోగించిన కత్తి తీసుకొని వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. భార్య, భర్తలు ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రణస్థలం మండలం కొవ్వాడలో నీలగిరిచెట్టు బెరడు తొలిచే కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. నిత్యం భార్యభర్తలు ఈ పనులే చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి భోజనం ముగించిన తర్వాత భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగినట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆవేశంతో చెట్టు బెరడు తొలగించడానికి ఉపయోగించే కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి సోదరుడు త్రినాథరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు విశాఖపట్నంలో తాపీమేస్త్రిగా పని చేస్తున్నట్టు తెలిపారు. సంఘటనా స్థలానికి జేఆర్ పురం సీఐ అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌తో పాటు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Comments