భవనం సిద్ధం.. రాజకీయమే అడ్డం!
- DV RAMANA
- Mar 24
- 2 min read
సర్వహంగులతో సిద్ధమైన కళ్లేపల్లి పీహెచ్‌సీ భవనం
నెలలు గడిచినా ప్రారంభానికి నోచుకోని నిర్మాణం
ఇరుకు గదిలోనే వైద్యంతో సిబ్బంది, రోగుల ఆవస్థలు
గత ప్రభుత్వం నిర్మించిందన్న ఉపేక్షే కారణమన్న ఆరోపణలు
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ప్రభుత్వ వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉదంతాలు రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటే.. మరోవైపు కల్పించిన వసతులను వినియోగంలోకి రాకుండా వాటిని నిరుపయోగంగా వదిలేసి శిథిలావస్థకు చేరుస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా రాజకీయ విభేదాలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాలు ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక శిథిలమైపోవడం ఒక ఉదాహరణగా నిలుస్తుంటే.. శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర (పీహెచ్‌సీ) భవనం కూడా ఇదే దుర్దశ ఎదుర్కొంటుండటం తాజా ఉదాహరణ. శ్రీకాకుళం రూరల్ మండలమంతటికీ గతంలో ఒక్క సింగుపురంలోనే పీహెచ్‌సీ ఉండేది. అది తప్పితే జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు పరుగులు తీయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గత వైకాపా ప్రభుత్వం వైద్యసేవల విస్తరణలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు పీహెచ్‌సీలు మంజూరు చేసింది. వాటిలో రూరల్ మండలంలో కళ్లేపల్లి ఒకటి. పీహెచ్‌సీతోపాటు సిబ్బందిని కూడా వెంటనే మంజురు చేయడంతో తాత్కాలికంగ ఒక గదిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. మరోవైపు వైకాపా ప్రభుత్వమే నాడు`నేడు పథకం కింద కళ్లేపల్లి పీహెచ్‌సీకి భవనాలు కూడా మంజూరు చేసింది. రూ.2.60 కోట్లతో ఈ నిర్మాణ పనులకు 2023 నవంబర్ రెండో తేదీన శంకుస్థాపన అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ఈ భవనంలో పడకలతో సహా వైద్యులు, సిబ్బంది గదులు, చిన్న చిన్న ఆపరేషన్లు చేయడానికి ఆపరేషన్ థియేటర్‌తోపాటు ఏసీ వంటి పరికరాలు కూడా సమకూర్చారు. అన్ని హంగులతో కొన్ని నెలల క్రితమే పీహెచ్‌సీ భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇంతవరకు ఇరుకు గదిలో వైద్యసేవలు పొందుతున్న స్థానికులు ఆ భవనాలను చూసి తమ కష్టాలు తీరుతాయని ఆనందపడ్డారు. కానీ వైకాపా తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు గానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గానీ పీహెచ్‌సీ భవనం వైపు కనీసం చూడటంలేదు.. దాన్ని ప్రారంభించడానికి చొరవ చూపడంలేదు. వైకాపా ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని తామెందుకు ప్రారంభించాలన్న రాజకీయ దురుద్దేశమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలు దుమ్ముధూళీ పట్టేస్తున్నాయని, మరికొన్నాళ్లు నిరుపయోగంగా ఉంచితే నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానిక ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణంలో చూడకుండా పీహెచ్‌సీ భవనాన్ని వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తేవాలని నాయకులు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments