మంగపతులున్నారు జాగ్రత్త!
- Guest Writer
- Mar 22
- 2 min read

‘‘ఎదిగిన పిల్లకు ఆ బట్టలేమిటి? ఆ బట్టలకు చేతులేవి? ఆ బట్టలు చూసి రేప్పొద్దున నా కూతుళ్లిద్దరూ అలాంటి బట్టలే కొనమని అడిగితే..? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మనింటి పరువు. వాళ్లు ఎంత పద్దతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది.’’
..ఈ డైలాగ్ ‘‘కోర్ట్’’ సినిమాలో మంగపతి పాత్ర వేసిన శివాజీ అంటాడు.
నిజానికి ఇంటి పరువేకాదు, సమాజం పాటించాల్సిన నైతిక విలువల్ని నిలబెట్టే బాధ్యత ఈరోజే కాదు, అనాది నుండి స్త్రీలే మోస్తున్నారు. స్త్రీ లేదా ఆడపిల్లలు ధరించే బట్టలే ఒక ఇంటి పరువుని కాపాడటం లేదా నాశనం చేయగలవని చాలామంది భావిస్తుంటారంటే ఆశ్చర్యం లేదు. అంతేకాదు, బట్టలే వ్యక్తిగత శీలాల్ని నిర్ధారిస్తుంటాయి కూడా. అంటే సంప్రదాయకంగా బట్టలు వేసుకునేవాళ్లు శీలవంతులు, ఆధునికంగా బట్టలు వేసుకునేవాళ్ళు శీలరహితులు అన్నమాట!
‘‘కోర్ట్’’ సినిమాలో శివాజీ ఆ డైలాగ్ చెప్పగానే మిగతా కుటుంబసభ్యుల దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు బెదురు కళ్ళతో సమాధానం చెప్పలేక చూడటం లేదా సిగ్గుపడి తలదించుకోవడం చేస్తారు. అంటే పురుషులు స్త్రీలని కుటుంబపరువు పేరుతో ఎంత తేలిగ్గా కండిషన్ చేయొచ్చో ఈ సన్నివేశం చెబుతుంది. ఆ మాటకొస్తే అసలు స్త్రీలే తమని తామే కండిషనింగ్ చేసుకుంటారనడంలో కూడా అతిశయోక్తి లేదు.
నిజానికి స్త్రీల కండిషనింగ్ బట్టల దగ్గర మొదలై.. నడిచే తీరు, నవ్వటం, మాట్లాడే భాష, శరీర భాష వరకూ కొనసాగుతుంది. మొత్తం ఉనికికే క్లిప్పులు పెట్టబడి వుంటాయి. ఇవన్నీ కుటుంబ పరువుతో ముడిపెట్టబడేవే అయుంటాయి.
‘‘ఏమిటా బట్టలు? అసలు ఆడపిల్లవేనా?’’
‘‘ఏమిటా నడక మగరాయుడులా? ఆడపిల్లవి కాదా?’’
‘‘ఏమిటా మొరటు భాష? ఆడపిల్లలు ఇలాగేనా మాట్లాడేది?’’
‘‘ఏమిటలా మగపిల్లల కళ్లల్లోకి చూస్తున్నావ్?
సిగ్గుతో తలదించుకోవద్దా ఆడపిల్ల అన్నాక?’’
‘‘ఏమిటా విరగబడి నవ్వు? ఆడపిల్లలంటే ఎంత సుకుమారంగా నవ్వాలి?’’
..పైన చెప్పినవన్నీ పరువు ముసుగులో వున్న స్త్రీల/ఆడపిల్లల కట్టడి రూపాలే. ఈ కట్టడులు పుట్టినప్పటి నుండి చచ్చేవరకు కొనసాగుతాయి. ఇప్పుడు అధునిక కాలంలో ఉద్యోగ, ఉపాధి నిమిత్తమై కుటుంబాలు దేశవ్యాప్తంగా విస్తరించి, చిన్నవైపోయిన కారణంగా పట్టణ ప్రాంత విద్యావంతుల కుటుంబాల్లో మంగపతులు తగ్గిపోతున్నారేమో కానీ అంతరించిపోలేదు. ఒకే కులంవారు అధికంగా నివసించే గవరపాలెం, కాపు వీధి, వడ్డెర కాలనీ వంటి చోట్ల, నగరాల్లో, బస్తీల్లోనూ మంగపతులు పుష్కలంగా కనబడతారు. మంగపతులు ఆర్ధికంగానో లేదా వ్యవహారాల నిర్వహణ కోసం తమమీద ఆధారపడ్డ పాపానికి తమ పరిధిలోకి వచ్ఛే వారందరి మీద పెత్తనం చేస్తుంటారు. వీరికి పరువు, పెత్తనం రెండు కళ్ళు. ఆ రెండిరటినీ నడిపించేది అహంకారం. అది ప్రధానంగా పురుషాహంకారం అని వేరేచెప్పాల్సిన అవసరంలేదు.
మంగపతులు స్త్రీల ప్రాతినిధ్యంతో సమాజం ముందుకు పోగలుగుతుందంటే అంగీకరించరు. వాళ్లు సమాజానికి ఇరుసు పురుషుడేనని, అతనే అన్నీ చేస్తాడని, స్త్రీ అతన్ని సౌకర్యవంతంగా వుంచే పాత్రకే పరిమితమవాలనీ వాదిస్తారు. కట్టడులన్నీ ఆడపిల్లలకే చెబుతారు కానీ మగపిల్లలకు చెప్పడానికేమీ లేదనుకుంటారు. వాడి బట్టలు పట్టించుకోరు. వాడి అలవాట్లు పట్టించుకోరు. సమాజం మొత్తం వాడి ఆస్తి అనే మంగపతులు నమ్ముతుంటారు. ఇది వివక్ష అంటే వాళ్లేం పట్టించుకోరు. అసలు ఆడవాళ్లూ, మగవాళ్లూ సమానమెలా అవుతారు అని వాదిస్తారు. ప్రకృతే స్త్రీలని కట్టడి చేస్తుందంటారు. స్త్రీలు రక్షించబడాల్సిన వారంటారు. మగవాడు తప్పులు చేస్తే దిద్దుకోవచ్చు కానీ స్త్రీ తప్పులు చేస్తే దిద్దుకోలేదంటారు. కాబట్టి స్త్రీలను ఎప్పుడూ ఓ కంట కనిబెట్టుకొని వుండాలంటారు. ఈ వాదనలకు స్త్రీలు అంగీకరించరనేం లేదు. ఆ రకంగా సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించడంలో మంగపతులు విజయం సాధిస్తూనే వుంటారు.
సినిమాలో మంగపతి పాత్రలో శివాజి ఎంటరవగానే ఈలలు, గోలలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా అతన్ని సమర్ధించే, వ్యతిరేకించే రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. ‘‘మంగపతి మాటలు దురుసుగా అనిపించొచ్చేమో కానీ అతను చెప్పింది వాస్తవం’’ అనేవారు సమాజానికి భయపడి, కట్టడులకు, కండిషనింగ్స్‌కి లోబడిపోయేవారే. అది అమానవీయమని, స్త్రీల జీవితాల మీద అమానుష ఆధిపత్య సంతకమని వారు భావించరు. మారవలసింది అభ్యుదయ కాముకులు కాదనీ, వెనుకబడ్డవారే మారాలనీ పురోగామివాదులు గట్టిగా చెప్పాల్సి వుంటుంది. ఇందుకు పోరాటం చేయాల్సి వుంటుంది.
కథ సెంట్రల్ ఐడియా అయిన పోక్సో చట్టం గురించి, కోర్ట్ నిర్వహించే తీరు గురించి చూపించిన విధానం గురించి నాకెన్ని అభ్యంతరాలున్నా సినిమాలోని పాత్రల కారక్టరైజేషన్, నటుల పెర్ఫార్మెన్స్ కోసం, భారీ సెట్స్, ఫైట్స్, కంగాళీ ద్యూయెట్స్ లేకుండా, సహజ వాతావరణంలో సినిమా తీసినందుకు దర్శకుడిని అభినందించాలి. అందుకే మంగపతి పాత్రమీద రాయటం జరిగింది. చూడదగ్గ సినిమానే కానీ చట్టం, కోర్టు వ్యవహారాల గురించి అప్రమత్తతతో చూడాల్సిన సినిమా ‘‘కోర్ట్’’!
- అరణ్య కృష్ణ
Comentários