మానసిక దౌర్భల్యం పెరిగిపోతోంది!
- DV RAMANA
- Mar 25
- 2 min read

‘పోటీ అనేది ఆటవిక న్యాయం, సహకారం అనేది నాగరిక న్యాయం’ అని అంటారు పీటర్ క్రొపొ ట్కిన్. కానీ అనాగరికంలోనూ, ఆటవికంలోనూ పరస్పర సహకారాలున్నాయి. అసలు ప్రకృతి పరిణామం లోనూ ఘర్షణ, సహకారం కలగలసే ఉంటాయి. సహకారంతోనే అభివృద్ధి అంతా జరిగింది. ఘర్షణ వేరు, పోటీ వేరు. పోటీతో అసూయలు, కోపాలు, ద్వేషాలు, శతృత్వాలు పెరగటానికి అవకాశాలున్న వ్యవస్థ మనది. పోటీ అనేది సముజ్జీల నడుమ, సమాన స్థాయిల మధ్య ఉండటం, అదీ అభివృద్ధి కోసం ఆరాటం గా ఉండాలే తప్ప, క్రూరత్వానికీ, నిస్సహాయితకు దారి తీయకూడదు. అందులోనూ ఈ పోటీలోకి డబ్బు ప్రభావం పెరిగిన తర్వాత గెలవటం, ఓడటం వ్యాపారంగా మారిపోయింది. పోటీలో ఓడిననాడు, పోటీపడ లేనినాడు, మనల్ని మనం నిందించుకోవడం, అసమర్థునిగా చిత్రించుకోవడం పెరిగి ఒత్తిడికి గురయ్యి భవిష్యత్తునే ఛిద్రం చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పోటీ విద్యారంగానికి పాకి, విద్యార్థుల తల్లిదండ్రుల పాలిట ఒక భయంకర ఉచ్చులా బిగుసుకుంటోంది. పిల్లలు అనేకానేక కారణాల, ప్రమేయాల వల్ల భిన్న మైన స్థాయిలను కలిగి ఉంటారు. వేరు వేరు నైపుణ్యాలనూ, సృజనాత్మకతలను, దృష్టికోణాలను కలిగి ఉంటారు. కానీ నేడు మన విద్యా వ్యవస్థ ఒకే రకమైన మూస తరహా యాంత్రిక విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా మారింది. ఇందులో పోటీపడి ఓడినవాడు, ఎందుకూ పనికిరాడనే భావాన్ని కలిగించడమూ ఈ విద్యావ్యవస్థ అందించిన ఆలోచనే. అందుకనే అనేకమంది ఐఐటీలు చదువుతున్న విద్యార్థులు, ఒత్తిడి భరిం చలేక తమను తామే హత్య చేసుకుంటున్నారు. లేదంటే హత్యలు చేసేవాళ్లుగా మారిపోతున్నారు. కాకినాడ లో జరిగిన సంఘటన చూస్తే, ఈ విద్యావ్యవస్థ ఎంతటి క్రూరత్వాన్ని ఇంజెక్ట్ చేస్తున్నదో బోధపడుతుంది. ఆ సంఘటన తలుచుకుంటేనే గుండెలన్నీ అవిసిపోతున్నాయి. ఒకటో తరగతి, యూకేజీ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని చేతులు, కాళ్లూ తాళ్లతో కట్టేసి, నీటి బకెట్‌లో తలలు ముంచి స్వయాన తండ్రే తన పిల్లల్ని దారుణంగా చంపేసాడు. తన పిల్లలు ఇతరులతో పోటీపడలేకపోతున్నారని, ప్రపంచంతో పోటీ పడలేకపో తున్నందుకు చంపేస్తున్నాననీ మరీ సూసైడ్ నోట్ రాసి చంపేశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చదువుకున్నవాడే, ఓఎన్‌జీసీలో ఉద్యోగం. మరి చదువు ఏమిచ్చింది ఇతనికి? ఎదురీది బతకటమె లాగో నేర్పాలి కదా చదువు! ముక్కు పచ్చలారని పిల్లల్ని చంపడమేమిటి? ఎంత క్రూరత్వం నిండుతోంది మనుషుల్లో! అంత చిన్న పిల్లలు ఎవరితో పోటీపడాలి! ఎల్‌కేజీ నుండే ఐఐటీ కోచింగ్‌లకు అవకాశమిస్తున్న బడులూ, అందుకోసం మరీ పిల్లల్ని పంపుతున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకమైన విధానం ఎందుకు పురుడుపోసుకుంది? విద్య, లాభనష్టాల వాణిజ్యమయ్యాక అందే ఆలోచనదే. డాలర్ కరెన్సీలు పోగుపడేసే మరలుగా మారిపోవడం తప్ప, మనుషులు మానవీయంగా వ్యవహరించడం ఆవిరై పోతూనే ఉంది. పిల్లల, వారి వారి మానసిక స్థితులను బట్టి, అభిరుచులనుబట్టి ఎలాంటి శిక్షణలిప్పించా లన్న ఆలోచనలే లేని అశాస్త్రీయ విద్యావ్యవస్థ మనది. పిల్లలు ఇలానే ఎదగాలన్న మూసధోరణి మనందరి లోనూ వేళ్లూనుకొని ఉంటోంది. సమాజ మానసిక స్థితీ అనారోగ్యమైపోయింది. మొన్నీమధ్య హైద్రాబాద్‌లో అప్పులయ్యాయని చదువుకున్న అధ్యాపకుడే, తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తానూ, తన భార్య ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి బలహీన మానసిక స్థితిలోకి నేటితరం ఎక్కువగా వెళ్లటం ఆందోళన కలి గించే విషయం. పిల్లలను, భార్యను చంపే అధికారం ఎవరిచ్చారు వీళ్లకి? ఈ చదువులు ఎంత అపసవ్య జ్ఞానాన్ని అందిస్తున్నాయి! మానసిక దౌర్భల్యం పెరిగిపోతున్నది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీయ టమో, ప్రాణాలు తీసుకోవటమో చేస్తున్నారు. ఇవన్నీ సామాజిక రుగ్మతలో భాగంగా జరుగుతున్నాయి. నేటితరం మెదళ్లపై వచ్చిపడుతున్న సమాచారమూ, విషయమూ, దృశ్యమూ అన్నీ వ్యాపారాత్మక వ్యర్థ కాలుష్యాలతో నిండిపోతున్నది. అదే తిరిగి ప్రతిఫలిస్తున్నది. ఇటీవల ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను కొట్టలేక, తిట్టలేక, చదువు, క్రమశిక్షణ నేర్పలేకపోతున్నామని బాధపడుతూ విద్యార్థులనే క్షమాపణ కోరుతూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే, విద్యార్థులను దండిరచే, తిట్టే అధికారం లేకుండా పోయిందని, అది లేకపోతే అధ్యయనం సాగదని బాధపడటంలో ఎంత అవగాహనా రాహిత్యం ఉందో అర్థమవుతుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇలాంటి అశాస్త్రీయ ఆలోచనలతో విపరీత చర్య లకు పూనుకుంటున్నారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, స్వేచ్ఛగా పిల్లలు అభ్యసనం కొనసాగించ గలిగితేనే నిజమైన మనుషులుగా, మానవీయతతో ఎదుగుతారు. ప్రేమైక సమాజానికి వారసులవుతారు. పోటీలో పడి కొట్టుకుపోతే బతుకునే కోల్పోతారు. తల్లిదండ్రులూ ఆలోచన చేయండి!
Comments