మాయమైన మాలిక్యూల్‌కు ఎక్స్‌పైరీ ప్రమాదం
- NVS PRASAD
- Apr 9
- 2 min read
కొద్ది నెలలే గడువు.. అలోగా పట్టుకోలేకపోతే కోట్ల నష్టం
కేసు దర్యాప్తులో కనిపించని పురోగతి.. రంగంలోకి సీఐడీ
చోరీ చేసినా అమ్ముకోలేకపోతున్న ఆగంతకులు
వారి యత్నాలకు గండి కొట్టిన ‘సత్యం’ కథనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన మాలిక్యూల్ చోరీ కేసు చిక్కుముడి ఇంతవరకు వీడలేదు. మరోవైపు దీన్ని చోరీ చేయగలిగిన ఆగంతకులు.. విక్రయించి సొమ్ము చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారని ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని పైడిభీమవరం వద్దనున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ నుంచి విలువైన మాలిక్యూల్ మిస్సయిన వెంటనే జిల్లా పోలీసులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేపట్టినా చోరీ అయిన సరుకును గానీ, అసలు నిందితులను గానీ ఇంతవరకు పట్టుకోలేకపోయారు. కేవలం అనుమానితులను ప్రశ్నించడం వరకే పోలీసులు పరిమితమయ్యారు. ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రూపొందించిన ఈ మాలిక్యూల్ ఫార్మా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. టైప్`2 మధుమేహం(షుగర్) ఉన్నవారికి ఇది సంజీవని లాంటిదని చెబుతున్నారు. అటువంటి మాలిక్యూల్ కోట్లు విలువ చేస్తుందని అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ మార్చి 19న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో జీవితాలను మార్చే మాలిక్యూల్ చోరీ పేరుతో మొదటిసారిగా ఫ్లాష్ చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఈ మాలిక్యూల్‌ను మార్కెట్‌లో ఫార్ములాగా మార్చే ప్రక్రియకు గండిపడినట్లు తెలుస్తోంది. ఈ మాలిక్యూల్ దాచే వేర్‌హౌస్‌లోకి వెళ్లడానికి యాక్సెస్ కార్డు ఉండాలి. ఇది కేవలం 12 మంది వద్ద మాత్రమే ఉండటంతో ఆ 12 మందిలో ఎవరో కొందరు చోరీచేసి ఉంటారని పోలీసులు భావించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యం కూడా యాక్సెస్ కార్డుతో ఓపెనయ్యే లాకర్ ముందు సీసీ కెమెరాలు ఎందుకని పెట్టలేదు. కానీ ఈ దొంగతనం జరిగిన తర్వాత దాదాపు 40 ఎకరాల ఈ కాంపౌండ్ చుట్టూ సీసీ కెమెరాలు బిగించారు. మాలిక్యూల్‌ను ల్యాబ్‌కు తీసుకువెళ్లి దాన్ని ఫార్ములాగా మారిస్తే గానీ అది డ్రగ్‌గా మారదు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షించి ఫార్ములా సరిగా ఉందని సర్టిఫై చేయాలి. అలా చేసిన వెంటనే రెడ్డీస్ ల్యాబ్‌కు సమాచారం అందిపోతుంది. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొలేటరీస్ చైర్మన్‌గా ఉన్న సతీష్ రెడ్డి రాష్ట్రంలో ఫార్మా రంగాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకమైన పదవిలో ఉన్నారు. ప్రధాన పరిశ్రమల సంఘాలు, ప్రభుత్వ ప్యానెళ్లలో చురుకైన సభ్యుడిగా ఔషధ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల రెడ్డీస్ ల్యాబ్‌లో మాయమైన కోట్ల విలువైన మాలిక్యూల్ ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ మాలిక్యూల్ కాలపరిమితి ఏడు నెలలు మాత్రమే. ఈలోపే దాన్ని ఫార్ములాగా మార్చాలి. అంటే టాబ్లెటా? ఇంజక్షనా? సిరప్పా? అనేది తేల్చాలి. లేదంటే కొద్ది నెలల్లోనే ఈ మాలిక్యూల్ ఎక్స్‌పైర్ అయిపోయి దేనికీ పనికిరాకుండాపోతుంది. ఇదిలా ఉండగా ఈ చోరీ కేసులో ఇద్దరు నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఐడీ కేసు టేకప్ చేయడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లేనని అంటున్నారు.

Comments