top of page

మార్కుల కోసం మాతృభాష బలి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 14
  • 2 min read

విద్యావ్యాపారాల్లో మార్కులు, ర్యాంకులు, ఆదాయాలు, లాభాలు వంటి వాటికన్నా మానవీయ శాస్త్రాలు ఎక్కువెలా అవుతాయి ఈ మార్కెట్‌ చదువుల మాయలో! మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వాలు అన్నీ విలవిల్లాడాల్సిందే ఆ మోహంలో! ఎంత తడి ఆరిపోతేనేం.. పొడిపొడిగా మార్కులు రాలిపడితేచాలు. వాటితో ర్యాంకులు ప్రకటనల బోర్డులపై మెరుస్తాయి. మైమరపిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇంటర్‌విద్యలో ప్రైవేటు మార్కెట్‌ భూమ్‌ వైపరీత్యాలను చూస్తూనే మౌనంగా ఉంటున్నాం. ‘చైనా’ విజృంభణలో తెలుగు‘వాడి’ పోయింది.. సోయి తప్పికొట్టుకుపోయింది.. పోతున్నదీ కూడా మనందరికీ తెలుసు. ఆ వేగంలో పడి, వలలో పడి ఎన్ని పోగొట్టుకున్నాం? ఎన్ని జీవితాల్ని తాకట్టు పెట్టుకున్నాం, ఆస్తుల్ని పోగొట్టుకున్నాం, ఆఖరికి మన పిల్లల్నీ పోగొట్టుకోలేదూ! దూరాలకు పోగొట్టు కుని దుఃఖాలకు బలిపెట్టు కోలేదూ! అయినా ఏదో ఒక ప్రవాహానికి కొట్టుకుపోవటం తప్ప, నిలబెట్టు కోవటంలో తెలుగువాడి వాడి పెద్దగా కనపడదు. ఇప్పుడదే ప్రభుత్వ బుర్రలోకి ప్రవేశించి తొలుస్తున్నట్టు తెలుస్తోంది. మాతృభాషలను ప్రోత్సహించాలని, కాపాడుకోవాలనీ సభల్లో గంభీరోపన్యాసాలు దంచే ప్రభుత్వ పెద్దలు అందుకు భిన్న ఆలోచనలు చేయటం నేటి విపరీతం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అన్ని కళాశాలల ప్రధానాచార్యులకు లేఖలు రాసి వివరాలు సమర్పించమని విద్యాశాఖ సంచా లకులు కోరారు. ప్రైవేటు కార్పొరేటు కళాశాలలతో పోటీ పడే నెపంతో తెలుగును కనుమరుగు చేసేం దుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వీటి ద్వారా అర్థమవుతున్నది. ఒకవైపు జాతీయ విద్యా విధానం పేరిట దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కేంద్రం చేస్తుంటే, ఇపుడు మన చేతులతో మనమే తెలుగు భాషను యువతరానికి దూరం చేసే పనికి పూనుకోవటం అత్యంత బాధాకరం. ఇప్పటికే రాష్ట్రంలోని కార్పొరేట్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలవుతున్నది. ప్రైవేటు కళాశాలల్లో చదివే పిల్లలందరూ ద్వితీయ భాషగా సంస్కృతాన్నే పరీక్షల్లో రాస్తున్నారు. ఎందుకంటే చదువుతున్నారని అనకూడదు. దానికి ఒకే ఒక్క కారణం మార్కులు అత్యధికంగా రావటం. ఇదేమీ భాషపైన ప్రేమతో, అభిమానంతో నేర్చుకోవాలన్న జిజ్ఞాసతో సంస్కృతాన్ని వాళ్లు చదవటం లేదు. కళాశాలలు బోధించ డమూ లేదు. సంస్కృతం రాస్తే మార్కులు 100కు 90 నుంచి 99 వరకు వస్తాయి. అది కూడా ఏం రాసీ రాయకున్నా, చూసీ చూడనట్లుగా మార్కులు పడిపోతాయి. అదే తెలుగు ద్వితీయ భాష అయితే అలా మార్కులు రావటం చాలా కష్టం. రావు కూడా. పోనీ వీళ్లకు సంస్కృత అధ్యాపకులు బోధన చేస్తారా? అంటే ఏమాత్రం కాదు. మెటీరియల్‌ అందించి బట్టీ పట్టిస్తారంతే! ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు చదువుకుని, సంస్కృతం ఒక్క ముక్క తెలియని వారు ఇంటర్‌లోకి రాగానే ఎకాఎకి సంస్కృతం తీసుకుని రాయడమేమిటి? ఇదొక అశాస్త్రీయ పద్ధతి. ఆ తర్వాత కానీ, వాడుకలో కానీ ఏమీ ఉపయోగం లేని భాషను కేవలం మార్కుల కోసం చదవటం, అందుకు ప్రభుత్వమూ పూనుకో వటం అజ్ఞానపు చర్య. మాతృభాషను నేర్చుకోవాలని, అధ్యయనం చేయాలని కోరుకోవటంలో కేవలం అభిమానం మాత్రమే కారణం కాదు. మాతృభాష మన నుంచి దూరమైతే, మన సంస్కృతి సంప్రదా యాల నుంచీ, బంధాలు, అనుబంధాల నుంచీ దూరమవుతాం. ఒక మానవీయ స్పర్శ నుంచీ దూరమ వుతాం. మాతృభాష ద్వారానే తార్కిక ఆలోచనలు పెంపొందుతాయి. మానసిక వికాసమూ అభివృద్ధి చెందుతుంది. సృజనాత్మక దృష్టీ పెరుగుతుంది. అందుకనే తెలుగును నేర్చుకోవాలి. బతికించుకో వాలి. మొదటి నుంచీ ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ తెలుగును నిర్లక్ష్యం చేసి, కళాశాల చదువు లోనూ ఏదో మార్కుల కోసం సంస్కృతం చదివి, ఏ భాషనూ పూర్తిగా పట్టుకోలేక రెంటికి చెడ్డ రేవడిలా విద్యార్థులు మారిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ రకమైన ఆలోచనను ఒకసారి చేశారు. అప్పుడు విమర్శలు తలెత్తడంతో ఆగిపోయింది. తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తా మని ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వమూ ఈ చర్యలకు పూనుకోవడం సరైనది కాదు. అనేకమంది భాషా సాహిత్యకారులు, సామాజిక సంఘాలు, మేధావులు తెలుగును ఎత్తేసే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తు న్నారు. ఇదేదో హిందీ, సంస్కృత భాషలపై ఉన్న వ్యతిరేకతతో చెబుతున్నది కాదు. మాతృభాషను విడిచి మార్కుల కోసం మరో భాషను నేర్పాలని చేసే ప్రయత్నం శాస్త్రీయమూ కాదు, సమంజసమూ కాదు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి మాతృభాషా వ్యతిరేక చర్యలను మానుకోవాలి.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page