top of page

మీరు సూపర్‌ సార్‌..! మీ ప్రతిష్ఠ కోసం జిల్లా పరువు తీశారు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 24
  • 4 min read
  • ఉపాధ్యాయుల మీద గుడ్డ కాల్చి వేసిన డీఈవో

  • 400 పైబడిన విద్యార్థులున్నచోట ఐదుగురు దొరికితే అంత హడావుడెందుకు?

  • అరగంట పరీక్షా కాలం కోల్పోయిన విద్యార్థుల మాటేమిటి?

  • కుప్పిలిలో ఎప్పుడూ చూసిరాతలేనని తెలిసినప్పుడు ఇన్విజిలేటర్లను ఎందుకు మార్చలేదు?

  • డీఈవో కుడిభుజం, కుడికన్ను ఎంఈవోలను ఎందుకు అక్కడ కూర్చోబెట్టలేదు?

  • ఉపాధ్యాయులు సరే.. గుమస్తా మీద చర్యలను ఎలా సమర్థిస్తారు?

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నిజాయితీపరుడు కాకపోయినా ఫర్వాలేదు.. అలా అనిపించుకోవడం సమాజంలో పైకి రావడానికి చాలా అవసరం. నిజాయితీపరుడన్న అబద్ధం జాగ్రత్తగా ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎంత కష్టమైన పనైనా ఎడమచేత్తో చేసిపారేస్తామన్న కల్పనల్ని ప్రచారంలోకి తీసుకురావాలి. అప్పటివరకు కష్టపడి ఏదైనా పూర్తిచేసిన వారికంటే సునాయాసంగా కీర్తికిరీటాన్ని నెత్తికెత్తుకోవాలి. సునాయాసంగా పబ్లిసిటీ పొందినవారిపైనే ప్రజలకు గౌరవం ఎక్కువ కలుగుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో చలామణిలో ఉన్న వ్యక్తిత్వ వికాస సూత్రం. విద్యార్థులకు ప్రతీ మోటివేటర్‌ ఈమధ్య ఇదే బోధిస్తున్నాడు.

అసలే ఆయన ఉపాధ్యాయుడు.. అందులోనూ ఉపాధ్యాయులను తయారుచేసే కళాశాలకు చీఫ్‌. ఇంకా సూటిగా చెప్పాలంటే జిల్లాలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులందరికీ బాస్‌. కాబట్టి.. ఇటువంటి సూత్రాలు ఆయనకు ఎవరూ నేర్పక్కర్లేదు. సునాయాసంగానే వంటబట్టించుకున్నారు. అందుకే జులైలో పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య జిల్లా చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఓ పెద్ద పబ్లిసిటీ స్టంట్‌నే సునాయాసంగా చేసిపారేశారు. కాకపోతే వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం జిల్లా పరువును తాకట్టు పెట్టేశారు.

మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించానని గర్వంగా చెప్పుకునే సగటు విద్యార్థి ఇప్పుడు శ్రీకాకుళంలో తాను టెన్త్‌ చదివానని చెప్పుకోడానికి సిగ్గుపడే పరిస్థితిని తిరుమల చైతన్య కల్పించారు. కుప్పిలి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌, మోడల్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌ జరిగిందని 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసి, ఆరుగురి మీద క్రిమినల్‌ కేసులు పెట్టిన తిరుమల చైతన్య పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగివుండొచ్చు. కానీ అదే సమయంలో తమకు సంబంధం లేని కొందరు ఉపాధ్యాయులు అనవసరంగా రచ్చకెక్కాల్సివచ్చిందన్న కోణాన్ని తిరుమల చైతన్య మర్చిపోయారు. కుప్పిలి పాఠశాలలో కాపీయింగ్‌ జరిగిన మాట వాస్తవం. కాకపోతే 15 మంది సస్పెన్షన్‌, ఆరుగురి మీద క్రిమినల్‌ చర్యలకు సిఫార్సు చేసినంత పెద్దది కాదు. ఈ విషయం తిరుమల చైతన్యకు ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు నిర్వహించే పద్ధతి ఎప్పుడో గతి తప్పిపోయింది. ఎందుకంటే.. ప్రభుత్వమే చూసిరాతలను ప్రోత్సహిస్తోంది. ఫార్మేటివ్‌ పరీక్షా పత్రాలు యూట్యూబ్‌లో కనిపిస్తే దొరికిపోయామన్న భావనతో ఆ పరీక్షలను రద్దు చేస్తున్నారు తప్ప, బయటకు పొక్కకపోతే నిర్లజ్జగా పరీక్షలను కొనసాగిస్తున్న సమాజంలో ఉన్నాం మనం. ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఇది అవసరం. ఈ ఏడాది పదో తరగతిలో చెప్పుకోదగ్గ రిజల్ట్‌ రాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వైకాపా తాము అధికారంలో ఉన్నప్పుడు నాడు`నేడు అనే విధానం ప్రవేశపెట్టడం ద్వారా మంచి రిజల్టును తేగలిగామని, కూటమి ప్రభుత్వం ఫెయిలయిందని ప్రచారం చేస్తుంది. రేపు వైకాపా అధికారంలో ఉంటే తెలుగుదేశం కూడా ఇదే పని చేస్తుంది. ఇక్కడ చదువు, పరీక్షలు, రిజల్టు కూడా ఒక రాజకీయ అజెండానే. కాబట్టి చూసిరాతలు కామననే కాసేపు అనుకుందాం. అయితే ఇది తప్పుకదా..! కష్టపడి పరీక్ష రాసే విద్యార్థి వెనుకబడిపోతున్నాడనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్నే తిరుమల చైతన్య సరిగ్గా క్యాష్‌ చేసుకున్నారు. రెండు సెంటర్లలో కలిపి 400 పైబడి విద్యార్థులు పదోతరగతి రాస్తుంటే.. కేవలం ఐదుగురి వద్ద మాత్రమే స్లిప్పులు దొరికాయి. ఇది ఏ సెంటర్‌లోనైనా జరిగే పనే. 400 మంది పిల్లలున్నచోట ఐదుగురి వద్ద మాత్రమే స్లిప్పులుంటే అది మాల్‌ప్రాక్టీసింగ్‌ ఎలా అవుతుంది? నిబంధనల ప్రకారం ఒక గదిలో, లేదా ఒక పరీక్షా కేంద్రంలో అందరూ సామూహికంగా చూసిరాస్తేనే మాల్‌ప్రాక్టీసింగ్‌ అంటారు. కానీ ఇక్కడ రెండు సెంటర్లలో కలిపి ఐదుగురే దొరికారు. అంతమాత్రానికి ఇంత పబ్లిసిటీ అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తుతున్నాయి. అన్నిటికీ మించి ట్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రూ.30వేలు కనీసంగా, రూ.50వేలు గరిష్టంగా ఇన్విజిలేటర్లకు ముట్టజెబుతున్నారన్న సమాచారం ఉందని డీఈవో తిరుమల చైతన్య పేర్కొనడమే కాకుండా ఆరుగురి మీద క్రిమినల్‌ కేసులకు ప్రొసీడ్‌ అయ్యారు. వాస్తవానికి ఈ కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులందరూ మత్స్యకార గ్రామానికి చెందినవారే. రూ.50వేలు ఉంటే ఏడాది తిని కూచోవచ్చన్న కుటుంబాలే. వీరికి ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీలు వంటి వాటి మీద అవగాహనే పెద్దగా ఉండదు.. మహా అయితే పదో తరగతి పాసైతే ఏ షిప్పుకో వెళ్లిపోవచ్చన్న ఆశ తప్ప. తన వద్ద ఆధారాలు లేవంటూనే సొమ్ముల అంశాన్ని తెర మీదకు తెచ్చిన డీఈవో తనకు తెలియకుండానే పెద్ద నిందను ఉపాధ్యాయుల మీద వేసేశారు. ఇప్పుడు దీన్ని నిరూపించాల్సిన బాధ్యత డీఈవో మీద లేకపోవచ్చు. కానీ ఈ సస్పెన్షన్‌, క్రిమినల్‌ కేసుల నుంచి బయటకు రావాల్సిన గత్యంతరం మాత్రం ఉపాధ్యాయులదే. గుడ్డ కాల్చి టీచర్ల మీదకు విసిరేసిన డీఈవో ఇప్పుడు దాన్ని ఆర్పుకుంటారో, మండిరచుకుంటారో అది మీ ఇష్టమనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మొదట్నుంచి తిరుమలచైతన్య శైలే అంత. సుదీర్ఘ కాలం డైట్‌ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఆయన డైట్‌ అనేదాన్ని ఓ బ్రహ్మపదార్థంగా మార్చేశారు. ఆయన, ఆయనతో పాటు ఓ గుమస్తాకు తప్ప అక్కడ ఇన్నేళ్లలో ఏం జరిగిందనేది ఇజ్రాయిల్‌ గూఢచార సంస్థ మొసాద్‌కు కూడా తెలియని రహస్యం. ఇక్కడ రెగ్యులర్‌ డీఈవోలు బదిలీ లేదా పదవీ విరమణ తర్వాత అడపాదడపా డీఈవోగా తిరుమల చైతన్య వస్తుంటారు. వచ్చిన ప్రతీసారి ఆయన పబ్లిసిటీ స్టంట్‌కు తెర లేపుతుంటారు. అయితే ఈసారి ఈ విన్యాసం పెద్దదయింది. ఒక విద్యార్థి వద్ద రూ.30వేలు నుంచి రూ.50వేలు వసూలుచేశారన్న ఆరోపణల నేపధ్యంలో ఇదేదో రాష్ట్రంలో రూ.300 కోట్ల కుంభకోణమన్న చర్చకు తిరుమల చైతన్య తెరలేపారు. వ్యక్తిగత కక్షలా? పబ్లిసిటీ స్టంటా? అనేది పక్కన పెడితే.. జిల్లా పరువును ఆయన తీసేశారు. ప్రధానోపాధ్యాయుడి పదోన్నతి జాబితాలో మొదట్లో ఉన్న సాయిరాం అనే ఉపాధ్యాయుడు తిరుమలచైతన్య పుణ్యమాని ఇప్పుడు సస్పెండయ్యారు. ఈయన పాత్ర ఎంతో డీఈవోకు తెలియంది కాదు. అలాగే దుర్గాప్రసాద్‌ అనే మరో ఉపాధ్యాయుడికి గుండెకు శస్త్రచికిత్స జరిగింది. లక్ష్మణరావు అనే మరో ఉపాధ్యాయుడికి కొన్నాళ్ల క్రితమే హార్ట్‌లో స్టంట్‌లు వేశారు. వీరి పాత్ర ఏమాత్రమనేది కాసేపు ఆలోచించివుంటే తిరుమల చైతన్యకు అర్థమైవుండేది. ఆరుగురు మహిళా టీచర్లు, ఎచ్చెర్ల ఎంఈవో`2, లావేరు ఎంఈవో`1, ఐదుగురు పోలీసులతో రెండు ఎగ్జామ్‌ సెంటర్లలో రైడ్‌లు చేస్తే.. స్లిప్పులు కలిగివున్నారన్న విద్యార్థులు ఐదుగురు మాత్రమే దొరకడం కొండను తవ్వి ఎలుకను పట్టడమే. ఐదుగురు విద్యార్థుల కోసం 14 మంది టీచర్లు, ఒక గుమస్తాను బలి తీసుకున్నారంటే తిరుమల చైతన్య ఏం సాధించినట్లు? తిరుమల చైతన్య సస్పెండ్‌ చేసినవారిలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసం ప్రతీ నెల తన జీతంలో రెండో వంతు ఖర్చు చేస్తున్నారు.

టీచర్ల బదిలీల్లో తాను అక్రమాలకు పాల్పడలేనంటూ గతంలో డీఈవో పోస్టుకు సెలవు పెట్టి వెళ్లిపోయిన తిరుమల చైతన్య అప్పుడూ పబ్లిసిటీనే ఆశ్రయించారు. టీచర్స్‌ యూనియన్‌ నాయకులు రికమండేషన్లు చేయించకూడదని, తన వద్ద అన్నీ నిబంధనల మేరకే జరుగుతాయని అప్పుడూ పబ్లిసిటీకే తెర లేపారు. అయితే అసలు తిరుమల చైతన్య తన హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్క పని కూడా చేయలేదా అంటే అక్రమ బదిలీలే కోకొల్లలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల చైతన్యను వెనక్కు పంపి పగడాలమ్మను డీఈవోగా తేవాలని భావించారు. కానీ తిరుమల చైతన్య ఇక్కడి రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వారు చెప్పిన పనులన్నీ చేసి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. జులైలో రిటైరయ్యే లోపు కూడా తనను తప్పించి పగడాలమ్మను తీసుకువచ్చే సూచనలున్నాయనే అభద్రతా భావంతో ఈ సంచలనానికి తెర లేపారు. 17 మంది సిబ్బంది రెండు పరీక్షా కేంద్రాలను చుట్టుముట్టి అల్లకల్లోలం సృష్టించిన వాతావరణంలో ఇంగ్లీష్‌ పరీక్షను విద్యార్థులు ఎలా సవ్యంగా రాసుంటారో తిరుమల చైతన్యే చెప్పాలి. మాస్‌ కాపీయింగో, మాల్‌ప్రాక్టీసో జరుగుతుందని నిరూపించడం కోసం ఒకే సామాజికవర్గానికి చెందిన విద్యాశాఖాధికారులను పట్టుకెళ్లి మరీ రైడ్‌ చేసిన తిరుమల చైతన్య ఎపిసోడ్‌లో ఒక్కటే బలమైన వాస్తవం. కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో ఇన్విజిలేషన్‌ విధుల్లో లేని ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడు తాను పని చేస్తున్న పాఠశాల విద్యార్థులు ఆ సెంటర్‌లో పరీక్ష రాస్తుండగా, అక్కడ కూర్చుని వారి కోసం జవాబులు తయారు చేయడం ఒక్కటే. ఈ విషయాన్ని మరో 13 మందికి ఆపాదించి 400 మంది పిల్లలను భయోత్పాతంలోకి నెట్టేసిన తిరుమల చైతన్య పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపొచ్చు. కానీ పోయిన జిల్లా పరువు అంత ప్రశాంతంగా వెనక్కు రాదు. ఈ జిల్లా నుంచి రేపు ఎవరైనా స్టేట్‌ర్యాంకర్‌గా నిలిస్తే చూసి రాస్తే ఎవరికైనా ర్యాంకులొస్తాయన్న భావన పక్క జిల్లాలో కలిగిత ఆ తప్పు తిరుమల చైతన్యదే.

కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో ఒక టీచర్‌ సమాధానాలు రాస్తున్నంత మాత్రాన అక్కడి నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న మోడల్‌ స్కూల్‌కు ఆ పేపర్లు చేరుతున్నట్టేనా? నిజంగా ఉపాధ్యాయులే విద్యార్థులకు సమాధానాలు ఇవ్వాలి అనుకుంటే వారి చేతిలో ఉన్న మొబైల్‌ ద్వారా వాట్సాప్‌కు తెప్పించుకుంటే సరిపోదా? ఒక్క టీచర్‌ చేతిలో ఆన్షర్‌ సీట్లు ఉన్నంత మాత్రాన ఆ పాఠశాల స్లిప్పుల కర్మాగారమైపోతుందా? చివరిగా నాలుగు వాహనాల్లో వచ్చిన డీఈవో బృందం ఒకటికి పదిసార్లు అక్కడ లేని కుప్పిలి జిల్లాపరిషత్‌ స్కూల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ బలివాడ కిశోర్‌ కోసం ఎందుకు పదే పదే అడిగారు? నిజంగా విద్యార్థుల దుస్తుల్లో స్లిప్పులు పట్టుకున్నారా? లేదూ అంటే ఎవరి వద్దనైనా స్లిప్పులుంటే డీఈవో డిబార్‌ చేస్తారు కాబట్టి వాటిని ఇచ్చేయమని కోరితే, ఇచ్చేశారా? ఆ స్లిప్పుల్లో సమాధానాలకు సరిపడే ప్రశ్నలు పరీక్షా పత్రంలో ఎన్ని ఉన్నాయి? ఇటువంటి దేనికీ సమాధానాలు లేకుండా ఓవరాక్షన్‌ చేసిన డీఈవోతో కూడిన బృందం భవిష్యత్తులో ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page