top of page

మనకెవ్వరికీ తెలియని ఫ్లాష్‌బాక్‌!

  • Guest Writer
  • 3 days ago
  • 3 min read

అల్లురామలింగయ్య తెలియకపోవడం ఏమిటి? అద్దిరిపోయే హాస్యనటుడు. లెక్కలేనన్ని సినిమాల్లో నటించాడు. ఎన్టీ రామారావూ, నాగేశ్వరరావూ లాంటి హీరోలే కాదు.. సావిత్రి, కన్నాంబ, కృష్ణకుమారి, సూర్యాకాంతం లాంటి సూపర్‌స్టార్లతో కలిసి నటించి, మెప్పించి హాస్యం పండిరచినవాడు. జయమాలినితో కలిసి డ్యాన్సు వేసి హిట్లు కొట్టినవాడు. ఒక్క చూపుతో,ఒక్క దొంగ నవ్వుతో ,ఒక్క చిలిపి చేష్టతో ఆంధ్రప్రదేశ్‌ లోని థియేటర్లు అన్నింటినీ నవ్వుల వెలుగుల పూల తోటలుగా మార్చినవాడు. చిరంజీవికి మామ. అల్లు అరవింద్‌ కి తండ్రి. తెలుగు సినిమాకి పెద్ద దిక్కు. సినిమా కామెడీకి కొండ గుర్తు!

ఇలా మనందరికీ తెలిసిన వెర్రివేషాల చిలిపి నటునికి ఆసక్తి కలిగించే ఒక సీరియస్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. అల్లు రామలింగయ్య అనేవాడు భారత స్వాతంత్య్ర పోరాటంలో పిడికిలి బిగించి ముందుకు ముందుకి నడిచినవాడు. నాటి కమ్యునిస్ట్‌ పార్టీకి హార్డ్‌కోర్‌ కార్యకర్త. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించి జైళ్ళ పాలైనవాడు. ప్రజానాట్యమండలికి విధేయుడైన వినమ్రుడైన అనుచరుడు. వేదికలెక్కి నాటకాలను రంజింపజేసి, జనాల్ని ఉత్తేజితుల్ని చేసిన ప్రజల మనిషి. పైకి ఎంత సాత్వికుడోలోన అంత తాత్వికుడు.

పిచ్చి డైలాగులు, వెర్రి వేషాలు వెండితెరమీదే గానీ, తెర వెనుక ఆయన ఒక నిండైన మానవతావాది. పేద ప్రజల కోసం జీవితం అంకితం చెయ్యాలని ఆశించినవాడు. ఆదరణకీ, ఆపేక్షకీ అర్థం తెలిసిన వాడు. పేదరికపు చీకటిలో మగ్గి,సంయమనంతో,బాధ్యతతో మెలగి కుటుంబాన్ని గట్టెక్కించినవాడు. కమ్యునిస్టు ఉద్యమం ఊపు తగ్గి,యువ రక్తపు ఆవేశం చల్లబడి,వామపక్ష వాదులూ,కళాకారులూ నెమ్మదిగా సర్దుకుని మద్రాసు రైలెక్కుతున్న రోజులవి. అది విషమ పరీక్షా సమయం! తమిళనాడులో మద్రాసులో ఎం ఏం జరుగుతుందో?ఎలా బతకాలో ఆనాటి మన నటినటుల ,దర్శకుల, నిర్మాతల, సాంకేతిక నిపుణుల అవస్థని ఒక్క వెయ్యి పేజీల పుస్తకంగా రాయొచ్చు.

సరే,ఇప్పుడు ఎందుకు అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుకోవడం? ఈ మధ్యనే ఆ నటుని జీవితం గురించి ఒక అందమైన పుస్తకం టేబుల్‌ బుక్‌ వచ్చింది. ‘పద్మశ్రీ డాక్టర్‌ అల్లు రామలింగయ్య నిA ూIఖీజు Iచీ ూIజుఖRజుూు దాని పేరు. కష్టపడి, శ్రద్ధతో, మంచి డిజైన్‌తో తెచ్చిన ఖరీదైన ఆర్ట్‌ పేపర్‌ పుస్తకం అది. మనం చూసి మురిసిపోయే అరుదైన బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌ ఫోటోలు కొల్లలుగా ఉన్నాయి. అల్లు జీవితం అంటే అది యాభైయేళ్ళ సినిమా చరిత్ర కూడా. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర. ఎందుకంటే, అతితక్కువ బడ్జెట్‌తో పొదుపుగా ప్రతి పైసా లెక్కపెట్టుకుంటూ సినిమాలు తీస్తున్న కాలం అది. ఎన్టీ రామారావు లాంటి హీరోకి కూడా ఉదయం రెండు ఇడ్లీలు మాత్రమే పెట్టిన రోజులవి! ఓసారి ఎన్టీ ఆర్‌ మరో రెండు ఇడ్లీలు కావాలని అడిగినపుడు, ‘‘రూలంటే రూలే, ఇక్కడ ఎవరికైనా రండు ఇడ్లిలే పెట్టేది’’అని నిర్మాత తెగేసి చెప్పాడు. కొన్ని లక్ష రూపాయలతో సినిమా నుంచి, కోటానుకోట్లు కుమ్మరించి మల్టీ కలర్‌ కమర్షియల్‌ సినిమాలు కనకవర్షం కురిపించిన అన్ని దశలనూ ప్రత్యక్షంగా చూసినవాడు, అందులో ఒక భాగం అయినవాడు అల్లురామలింగయ్య. 1951 నుండి 2004 దాకా నడిచి,పరిగెత్తి, పిల్లిమొగ్గలు వేసి, ఘనవిజయాలు సాధించిన చరిత్రని ఈ పుస్తకంలో సాధికారికంగా రికార్డు చేసారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు అల్లు సొంత ఊరు. వెంకయ్య, సత్తెమ్మలకు 1922 అక్టోబర్‌ ఒకటిన జన్మించాడు. అల్లుకి ముగ్గురు అన్నలూ, ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. చిన్నతనంలోనే కళలంటే మోజు. ‘భక్తప్రహ్లాద’ వీధి నాటకంలో బృహస్పతిగా చిన్నవేషం కట్టాడు. నాటకాలు, ప్రజా ఉద్యమాలు ఆకర్షించాయి. హరిజనోద్ధరణ అంటూ అభ్యుదయ నాటక సమాజాల వెంట తిరిగాడు. ఆ కుర్రాన్ని జాతీయ ఉద్యమం ఇన్స్పైర్‌ చేసింది. గాంధీజీ అమలాపురం వస్తున్నారు అని తెలిసి కుర్రాలను పోగు చేసి వెళ్ళాడు. గాంధీ ప్రసంగం విన్నాడు. ఖద్దరు మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నాడు. యువకుల్ని రెచ్చగొడుతున్నాడని, ఉద్యమాల్లో తిరుగుతున్నాడని ఆనాడే పోలీసులు అల్లుని అరెస్ట్‌ చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో పెట్టారు. అలా యుక్త వయసులోనే కటకటాల చేదు అనుభవం!

మా నాన్న తాడి అప్పలస్వామి స్వతంత్ర ఉద్యమ కాలంలో కడలూరు డిటేన్యుగా ఉన్నారు. మాతోపాటు అల్లు రామలింగయ్య కూడా ఆ జైల్లోనే ఉన్నాడని మా నాన్న చాలా సార్లు నాకు చెప్పారు. రాట్నంపై నూలు వాడకడంలో మొదటి బహుమతి పొందిన కనక రత్నం అనే ఆమెను రామలింగయ్య పెళ్లి చేసుకున్నారు. దేశభక్తి వారిద్దరినీ కలిపింది. ప్రజా నాట్యమండలిలో ఒక ముఖ్యునిగా ఉన్నారు. గరికపాటి రాజారావు, ఆత్రేయ ,పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్‌ రామచంద్రారెడ్డి ,పినిశెట్టి శ్రీరామ్మూర్తి, అనిశెట్టి సుబ్బారావు, మిక్కిలినేని రాధాకృష్ణ, చదలవాడ కుటుంబరావులతో కలిసి పనిచేశాడు. ప్రజానాట్యమండలిని ముందుండి నడిపించిన గరికపాటి రాజారావు 1952 లో తీసిన ‘పుట్టిల్లు’ సినిమా అల్లు రామలింగయ్య తొలి చిత్రం. జమునకి కూడా అదే మొదటి సినిమా. అల్లు పెద్ద స్టార్‌ అయ్యాక ఇంటికి వచ్చిన జమునకు తన గదిలో ఉన్న గరికపాటి రాజారావు ఫోటో చూపిస్తూ, ‘‘ అమ్మాయ్‌ , మనకి అన్నం పెట్టిన వాళ్లను ఎలా మరిచిపోతాం చెప్పు!’’ నారాయణ.

డైలాగు మర్చిపోయినప్పుడు సరదాకి అల్లు అన్న ‘‘ఆమ్యామ్యా ‘‘అనే మాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయింది. విలనీలో విశిష్ట హాస్యం, హాస్యంలోంచి విలనీ సాధించిన అద్భుత నటుడు ఆయన అన్నారు రావికొండలరావు. అప్పట్లో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, హీరోతో పాటు ‘‘క్యాస్టింగ్‌లో అల్లు రామలింగయ్య ఉన్నారా?’’ అని అడిగేవాళ్లు. 1953 నుంచి 2004వ సంవత్సరం దాకా 50 ఏళ్లు వెయ్యి సినిమాల్లో నటించారాయన. ఈ పుస్తకంలో వెయ్యి చిత్రాల పేర్లు ఇచ్చారు. ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం, అభినయం కలగలిపింది నటన అంటారు. దానిలో ఆరితేరిన వాడు అల్లు. ‘‘ సున్నితమైన హృదయం వినిపించే మధుర సంగీతం హాస్యం అన్నారో కవి. అల్లు విషయంలో ఆ మాటలు అక్షరాలా నిజం. కన్నీళ్ళకి,హాస్యానికి గల ప్రాధాన్యం, కారణం స్పష్టంగా తెలిసిన జ్ఞాని ఆయన అన్నారు రావు గోపాల్‌ రావు.

‘‘అల్లు ప్రతిభావంతుడు. ఆయన్ని హాస్య నటుడు అనడం కన్నా గొప్ప క్యారెక్టర్‌ యాక్టర్‌ అనడం సమంజసం’’ అన్నారు దర్శకుడు బి.యన్‌.రెడ్డి. చూసే వాళ్లకు విసుగు, మొనాటనీ అనిపించకుండా అన్నేళ్ళు జనాన్ని ఎంటర్‌టైన్‌ చేసి చేసి నవ్వించడం అతి కొద్ది మందికే సాధ్యం. చిత్తూరు నాగయ్య చివరి రోజుల్లో ఆయన పరిస్థితి తెలుసుకొని, ఓ బస్తా బియ్యం రిక్షాలో వేసుకుని,’’ పాలకొల్లు నుంచి పది బియ్యం బస్తాలు వచ్చాయి. అంత బియ్యం నేనేం చేసుకోను? అందుకే అయినవాళ్లకు పంచుతున్నానని చెప్పారు. సినిమా వాళ్లకి బియ్యం సరఫరా చేసే నెల్లూరు వీరాస్వామి నాగయ్యను కలిసినప్పుడు, అవి పాలకొల్లు బియ్యం కావని నెల్లూరు బియ్యమని అల్లు నా దగ్గరే కొన్నారని చెప్పారు. రామలింగయ్య మంచితనం, మనిషితనం గురించి ఈ పుస్తకంలో ఇలాంటి సంఘటనలు రాయడం ఎంతో బాగుంది. తెలుగులో రేలంగి తర్వాత ‘పద్మశ్రీ’ గౌరవం పొందిన ఒకే ఒక హాస్యనటుడు అల్లు.

ఎస్వీ రంగారావు, గోపాల్‌రావు, నాగభూషణం, రాజబాబు. ఇలా ఎవరున్నా రామలింగయ్య మెరుపులు, విరుపులూ, జనాన్ని ఊగించేవి. సావిత్రి, వాణిశ్రీవే కాదు, రమాప్రభ, జయమాలిని, మనోరమ, స్మితాలాంటి వాళ్ళున్నా, రామలింగయ్యతో కాంబినేషన్‌ సూపర్‌ హిట్టయ్యేది. నవ్వుకి మారుపేరుగా బతికిన ఆయన 2004 జూలై 31న కన్నుమూశారు. అల్లు రామలింగయ్య గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం స్టాంప్‌ విడుదల చేసింది. ఆయన పేరు మీద ఉన్న ప్రభుత్వ హోమియో కాలేజీని కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధతో పునరుద్ధరించారు. చివరి సంవత్సరాలు అల్లుతో సన్నిహితంగా ఉన్న సీనియర్‌ జర్నలిస్టు, రచయిత ,చిల్లకట్టు శ్రీకాంత్‌ కుమార్‌ ఈ పుస్తకం కోసం శ్రమతో పరిశోధించి సమాచారం సేకరించారు. శ్రీకాంత్‌ కృషి అభినందనీయం. డాక్టర్‌ మన్యం గోపీచంద్‌ ఈ పుస్తకానికి సంపాదకులు. రచయిత, అన్విక్షికి పబ్లికేషన్స్‌ అధిపతి వెంకట శిధారెడ్డి పర్యవేక్షణలో ఈ అపురూపమైన పుస్తకం తయారైంది. అయితే అందరికీ అందుబాటులో ఉండని బాగా ఖరీదైన మల్టీకలర్‌ పుస్తకం ఇది. పెద్ద వాళ్లకి, బంధుమిత్రులకి ఇవ్వడానికే పనికొస్తుంది. ఎక్కువ మందికి చేరేలా బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయినప్పటికీ వందో రెండొందలో రేటు ఉండేలా అల్లు జీవిత చరిత్ర పుస్తకంగా తీసుకువస్తే, ముందు తరాల కోసం ఒక మంచి పని చేసినట్టు అవుతుంది.

  • తాడి ప్రకాష్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page