యథా చంద్రబాబు.. తథా పాలన!
- DV RAMANA
- 3 days ago
- 2 min read

‘నేను మారాను.. నన్ను నమ్మండి.. ఇక మీ కోసమే నా పోరాటం’ అని చంద్రబాబు చెబితే ‘నిజమే కాబోలు’ అని ప్రజలు నమ్మేశారు. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో చూపించారు. దానికితోడు ‘ప్రశ్నిస్తాను.. రాజకీయాలను మార్చేస్తాను’ అన్న పవన్‌కల్యాణ్ పవర్‌ఫుల్ డైలాగులు కలిసొచ్చాయి. అంతే సీను మారిపోయింది. అధికారం మళ్లీ బాబు చేతికొచ్చింది. ఇంకేముంది.. బెల్లం చుట్టూ చీమల్లా అల్పజీవులందరూ అధికారం చుట్టూ మూగిపోయారు. అది చూసి మొన్నటి స్వర్ణయుగం తిరిగొచ్చిందని బాబుగారు సంబరపడిపోయారు. ఆ ఆనందంలో ఎన్నికల ముందు చెప్పిన మాట లన్నీ మళ్లీ అబద్ధాలైపోయాయి. ప్రపంచస్థాయి రాజధాని భారీ సెట్టింగుల కథలూ తిరిగి మొదల య్యాయి. నవ నగరాలు.. వాటి నడుమ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఆ సాకుతో మరో 35వేల ఎకరాల భూసేకరణ ప్రతిపాదన తెరపైకి వచ్చాయి. ఏమిటీ అంతులేని భూదాహం? ఎందుకీ ప్రపంచ రాజధాని? ఎవరి కోసం? చంద్రబాబు కథ మళ్లీ మొదటికే వస్తోంది. జనం పిచ్చోళ్ళు కాదు. అమాయకులు అంతకంటే కాదు. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు బాబును క్షమించారు. దీన్నే అలుసుగా తీసుకున్నారేమో.. ‘అప్పుడేదో అవసరంకొద్దీ అన్నాను గానీ... నేను మారనుగాక మారను’ అని చంద్రబాబు అనుకొంటున్నట్లున్నారు. అలా అనుకున్న హేమాహేమీలు గతంలో కనుమరుగయ్యారు. అలా ఎగిరిపడ్డ కుర్రాడు(జగన్) నిన్ననేగా మన కళ్ల ముందే బొక్కబోర్లా పడ్డాడు. బాబు పంచతంత్రం కథలు చదివినట్టు లేదు. చదివినవారినీ దరిచేరనీయలేదు. అందుకే మిత్రలాభం, మిత్రభేదం గురించి ఆయనకు తెలియదు. అందువల్లే కరటక దమనకుల ఎత్తులో చిక్కి చిత్తయిన సంజీవకుడు కానున్నారు. ఏమయినా ఆంధ్రదేశానికి మరోమారు చంద్ర గ్రహణం ఛాయలు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధానికి మళ్లీ 44వేల ఎకరాలు తీసుకోవడం దేనికి? ఇప్పటికే రైతుల నుంచి సుమారు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే! తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రూ.31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు కాకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు? అవుటర్ రింగ్ రోడ్డు ఎందుకు? హైపర్ లూప్ రైల్వే వ్యవస్థ అమెరికా, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే లేదు. కానీ ఏపీలో మాత్రం ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ రెడీ చేయమని చెప్పడం చంద్రబాబు అత్యుత్సాహమే. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు.. రాష్ట్రానికి ఇప్పుడున్న ఆరు ఎయిర్‌పోర్టులు సరిపోవా! మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి? అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఎవరడిగారు? శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు పెట్టాలని ఎవరడిగారు? దాని బదులు పరిశ్రమలు పెట్టొచ్చు కదా! శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా ఇతర ప్రాంతాల్లో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు కావాల్సింది పంటలకు సాగునీరు, స్థానికంగా ఉపాధి అవకాశాలు. వాటి గురించి ఆలోచించరెందుకు? గతంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయకుండానే పీ4 పేరుతో పేదలను ఉద్దరించేస్తామనడాన్ని ఎవరైనా ఎలా నమ్మగలరు. పీ4 విధానం.. అంటే డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేసే పద్ధతి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలో ఉన్న మూడు అతిపెద్ద విద్యాసంస్థలు టీడీపీ నాయకులవే. ఆ సంస్థల్లో పది శాతం సీట్లు పేద విద్యార్ధులకు ఇప్పించి ఉచితంగా చదువు చెప్పించవచ్చు. అంతెందుకు పీ4లో ఇతర వ్యాపార, సంపన్నవర్గాలే పేదల ఉద్ధరణకు ముందుకు రావాలా? చంద్రబాబు తమ సొంత సంస్థ అయిన హెరిటేజ్ నుంచి అటువంటి ఉదార పనులు ఎందుకు చేయించలేకపోతున్నారు. ముందు నాయకుడు ఆచరణలో పెడితే ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది కదా! ఇలాంటివి చేయకుండా వాగాఢంబరాలు, అట్టహాసాలతో రాష్ట్రానికి కొత్తగా ఎటువంటి మేలు జరగకపోగా మరింత వెనుకబడిపోతుంది.
Comments