top of page

రాజుగారి తప్పులకు డీజీఎం తందానా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 8
  • 3 min read
  • గార ఎస్బీఐ కుంభకోణంలో తెరవెనుక మరో పాత్ర

  • తప్పుడు సమాచారంతో అతన్ని తన దారికి తెచ్చుకున్న మాజీ ఆర్‌ఎం

  • స్వప్నప్రియ ఆత్మహత్య విషయంలో ఆ అధికారి అత్యుత్సాహం

  • చావుబతుకుల్లో ఉన్న ఆమెతో ఖాళీ కాగితాలపై సంతకాలు ఎందుకు?

  • న్యాయం చేయాలని ఇటీవల ఢల్లీిలో కుటుంబ సభ్యుల ధర్నా


జిల్లాలో సంచలనం రేపిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) గార బ్రాంచి తాకట్టు నగల కుంభకోణంలో తెర వెనుక మరో పాత్ర బయటకొచ్చింది. ఇంతవరకు గార బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కావడం, మళ్లీ ప్రత్యక్షమవడం, మధ్యలో అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం, ఆమె కుటుంబాన్ని బాధ్యుల్ని చేస్తూ జైలుకు పంపడం వంటి దరిద్రాలకు కారణం అప్పటి రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజు అని బ్యాంకు వర్గాలన్నీ ఒక అవగాహనకు వచ్చిన తరుణంలో ఇంతవరకు రాజు మీద చర్యలెందుకు లేవు? అన్న ప్రశ్న వేసుకుంటే.. ఈ తెర వెనుక పాత్ర బయటపడిరది. విశాఖపట్నం ఎస్‌బీఐ మాడ్యూల్‌కు డీజీఎంగా వ్యవహరిస్తున్న ఒక అధికారికి మొదట్నుంచీ టీఆర్‌ఎం రాజు తప్పుడు సమాచారం అందించడంతో ఆయన పూర్తిగా గాడితప్పి వ్యవహరించినట్టు బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి. గార వ్యవహారంలో ఈ డీజీఎం, అప్పటి ఆర్‌ఎం రాజు ఇద్దరూ కలిసి పోలీసులను తప్పుదోవ పట్టించారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గార బ్రాంచిలో తాకట్టు బంగారం మాయమైనప్పుడు కేసు రిజిస్టర్‌ చేయాల్సివచ్చింది. దీనికి సంబంధించి బ్యాంకు లా ఆఫీసర్‌ డ్రాఫ్ట్‌ చేసిన ఫిర్యాదును మార్చేసి ఇక్కడ వేరేగా తయారుచేసి అప్పటి ఆర్‌ఎం రాజు పోలీసులకు ఇచ్చారు. దీనికి డీజీఎం సహకరించారని తెలిసింది. టీఆర్‌ఎం రాజు ఫోన్‌లో మౌఖికంగా డీజీఎంతో మాట్లాడి ఆయన నుంచి మెసేజ్‌ ద్వారా ఆదేశాలు తెప్పించుకున్నారని.. తీరా ఇప్పుడు ఆయన్నే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్టు భోగట్టా. డీజీఎం చెబితేనే తాను చేశానని టీఆర్‌ఎం రాజు ఉన్నతాధికారులకు చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెట్టి డీజీఎంకు తప్పుడు లెక్కలు చెప్పి, ఆయన ద్వారా ఆదేశాలు తెప్పించుకొని ఇప్పుడు ఆయన్నే బుక్‌ చేసినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మొదట్నుంచీ డీజీఎంకు, టీఆర్‌ఎం రాజుకు మధ్య ఏదో అవగాహన ఉందని, అందుకే శ్రీకాకుళం జిల్లాలో ఎస్‌బీఐ బ్రాంచిల్లో ఏదో ఒక మూల ఏదో ఒక డ్యామేజ్‌ జరుగుతున్నా ఏరోజూ డీజీఎం హోదాలో ఏ శాఖనూ ఆయన పరిశీలించలేదు. ఒకవేళ శ్రీకాకుళం వచ్చినా ఎప్పుడు వస్తున్నారో తెలియకుండా దొంగచాటుగా వచ్చి వెళ్లిపోతున్నారు. గార బ్రాంచిలో పెద్ద ఎత్తున బంగారం మాయమవడం, తమ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన అసలు సీరియస్‌గా తీసుకోలేదు. నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం వెలుగు చూసినప్పుడు దాన్ని ‘సత్యం’ పత్రికే తొలిసారి బయటి ప్రపంచానికి చెప్పింది. కానీ డీజీఎం మాత్రం అవన్నీ తప్పుడు కథనాలంటూ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు ఓ నివేదిక ఇచ్చినట్టు భోగట్టా. అయితే ఇప్పుడు అదే బజారుబ్రాంచ్‌ ఇష్యూపై దర్యాప్తు చేయాలని బ్యాంకు అధికారులే సీఐడీని కోరారు. అలాగే శ్రీకాకుళం మెయిన్‌ బ్రాంచిలో కూడా అవకతవకలు జరిగాయి. మరో బ్రాంచిలో డ్వాక్రా రుణాల కుంభకోణం, తప్పుడు పత్రాలతో రుణాల మంజూరు వంటివి వెలుగుచూశాయి. వీటన్నింటిపైనా డీజీఎం ఇన్నాళ్లూ చూసీచూడనట్లు వ్యవహరించారు.

వ్యక్తిగత నోటీసులకు బ్యాంకు లాయర్‌ ఎందుకు?

ఈ ఏడాది డీజీఎంకు జీఎంగా పదోన్నతి రావాల్సి ఉంది. అదే సమయంలో తన పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని పలు శాఖల్లో అవకతవకలు జరిగాయని బయటపడితే ప్రమోషన్‌ ఆగిపోతుందన్న భయంతో టీఆర్‌ఎం రాజు చెప్పినట్టల్లా ఆడి సీజీఎం స్థాయి అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిసింది. గార బ్రాంచి విషయంలో టీఆర్‌ఎం రాజుకు హైకోర్టు న్యాయవాది నుంచి నోటీసులు వస్తే.. తాను శ్రీకాకుళం రీజనల్‌ మేనేజర్‌ను కానని, తనకు సంబంధం లేదని రిజక్ట్‌ చేశారు. అయితే ఇది ఆర్‌ఎం హోదాకు ఇచ్చిన నోటీసు కాదని, వ్యక్తిగతంగా ఇచ్చినదని చెప్పడంతో దాన్ని తీసుకున్నారు. కానీ రాజు తరఫున హైకోర్టులో వాదించడానికి బ్యాంకు నుంచి లాయర్‌ను పెట్టుకోడానికి డీజీఎం పరోక్షంగా అనుమతులిచ్చినట్టు ఆరోపణలున్నాయి. గార బ్రాంచి ఇష్యూలో ముంబై ప్రధాన కార్యాలయానికి తప్పుడు నివేదికలు ఇచ్చింది కూడా సదరు డీజీఎం అని తెలిసింది. స్వప్నప్రియ కుటుంబ సభ్యులే ఆమెను చంపేశారని, అలాగే క్యాష్‌ ఇన్‌ఛార్జి సురేష్‌ను కొట్టించారని ఓ పథకం ప్రకారం కథనాలు రాయించి, వాటిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయించి, ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి ముంబై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

అతని ప్రమేయానికి ఆధారలివే!

స్వప్నప్రియ ఆత్మహత్యకు పురికొల్పే వాతావరణాన్ని కల్పించినవారి పాత్రను బయటకు తీయాలని కోరుతూ ఇటీవలే ఢల్లీిలోని జంతర్‌మంతర్‌ వద్ద స్వప్నప్రియ కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడికి నెల క్రితం స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళ సామాజిక న్యాయశాఖ మంత్రిని కలిసి ఎవరి ద్వారా ఎవరికి డబ్బులు వెళ్లాయి? కథనాలు ఎలా వచ్చాయి? స్వప్నప్రియ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? ఆ తర్వాత బ్యాంకు అధికారులు వ్యవహరించిన తీరుపై దర్యాప్తు జరపాలని కోరారు. 2023 నవంబరు 23న రాత్రి 9 గంటల ప్రాంతంలో జాయింట్‌ కస్టోడియన్‌/ క్యాష్‌ ఆఫీసర్‌గా ఉన్న ముంజు సురేష్‌పై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు వెళితే.. 9.10 గంటలకే ఈ దాడి స్వప్నప్రియ కుటుంబ సభ్యులు చేయించారంటూ ఈ డీజీఎం ముంబై ప్రధాన కార్యాలయానికి మెయిల్‌ పంపడం కొసమెరుపు. గార బ్రాంచిలో ఏం జరిగిందో తెలియనట్లు వ్యవహరించిన డీజీఎం ఈ విషయంలో మాత్రం పదే పది నిమిషాల్లో తానే ఇన్వెస్టిగేట్‌ చేసేసి స్వప్నప్రియ కుటుంబంపైకి నేరాన్ని నెట్టేస్తూ మెయిల్‌ చేయడం కంటే దారుణం మరోటి లేదు. డీజీఎం, అప్పటి ఆర్‌ఎం రాజు కలిసి స్వప్నప్రియ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుంటే డీజీఎం ఆఫీసులో చీఫ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న సత్యసాయిబాబాను ఆస్పత్రికి పంపించి ఐసీయూలో ఉన్న స్వప్నప్రియ ఫొటోలు తీయించి, తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడం చూస్తే డీజీఎం పాత్ర మరోసారి బయటపడిరదని స్వప్నప్రియ కుటుంబ సభ్యులు జంతర్‌మంతర్‌ వద్ద జరిపిన ధర్నాలో నినాదాలు చేశారు. సత్యసాయిబాబా కాల్‌లిస్ట్‌ను కూడా బయటపెట్టాలని, ఫొటోలు, తెల్లకాగితాల మీద సంతకాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని వీరు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page