వేట నిషేధ సమయంలో నిండైన భరోసా..!
- Guest Writer
- Apr 18
- 2 min read
మత్స్యకార భరోసా చెల్లింపునకు మార్గదర్శకాలు
జాబితాల రూపకల్పనలో సంబంధిత అధికార వర్గాలు
ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున చెల్లింపు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గత వైకాపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు మాత్రమే ఇచ్చేవారు. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం రూ.20వేలు ఇస్తామని చెప్పింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సారధ్యంలో అతి పెద్ద పండుగను శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి అతిథిగా రానున్నట్టు తెలుస్తుంది.

అచ్చెన్నాయుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన పరంగా సంబంధిత శాఖల్లో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం వ్యవసాయ, మత్స్యకార ఆధారిత జిల్లా కావడంతో ఇరు వర్గాలకూ తగిన సమయంలో ఆర్థిక ప్రయోజనం దక్కే విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మార్గదర్శకాలు అందుకుని వేటే ఆధారంగా జీవించే సంబంధిత జాలరి కుటుంబాలకు ఈ మత్స్యకార భరోసా ఉపయోగపడేలా అర్హుల ఎంపికకు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మంత్రి అచ్చెన్న ఆదేశాలు అందుకుని సంబంధిత పనులలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సంబంధిత లబ్ధిదారులకు ఈ నెల 26న మత్స్యకార భరోసా అందజేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మత్స్యకారులకు జీవన భృతి వేట నిషేధ సమయంలో ఇచ్చేందుకు వీలుగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకుగా కూటమి ప్రభుత్వం చర్యల పట్ల మత్స్యకార కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార భరోసా చెల్లింపుతో వేట నిషేధ సమయంలో అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 61 రోజుల కాలానికి సంబంధిత మత్స్యకార వర్గాలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతోంది. సామాజిక పింఛన్ల పెంపు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల అందజేత వంటి మంచి కార్యక్రమాల అమలుతో దూసుకుపోతోంది. బడుగు, బలహీన వర్గాలకు మరింత చేరువయ్యేందుకు ముందున్న కాలంలో కూడా వివిధ పథకాల అమలుకు చర్యలు చేపట్టనుంది. ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపుతున్నారు. దీంతో గత ప్రభుత్వం కన్నా భిన్నంగా బెస్తవాడలలో అభివృద్ధి వెలుగు రేఖలు ప్రసరించనున్నాయి. వేట నిషేధ సమయంలోనే కాకుండా మిగిలిన సమయాల్లో కూడా మత్స్యకారులను ఆదుకునేందుకు, వారికి ఉపాధి అవకాశాల కల్పనకు, తీర ప్రాంతాల అభివృద్ధికి సైతం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మూలపేట పోర్టు అభివృద్ధితో పాటే వివిధ స్థాయిలో ఉన్న జెట్టీల నిర్మాణం పూర్తి, మత్స్యకారులకు ఊతం ఇచ్చే విధంగా వివిధ పథకాల వర్తింపునకు మున్ముందు ప్రణాళికలు అమలు కానున్నాయి. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఈ జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అందరి బతుకుల్లో వెలుగులు నింపడమే తన ధ్యేయమని మంత్రి అచ్చెన్న చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా కూటమి సర్కారు కార్యాచరణ ఉండనుందని స్పష్టం చేస్తూ ఉన్నారు.

- కల్లూరి రమణ, పీఆర్‌ఓ,
వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
Comments