top of page

వీడిన నిద్ర.. ప్రతిపక్ష ముద్ర

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 14
  • 2 min read
  • డీసీసీబీ కాలనీ ఆక్రమణలపై సమష్టి విజయం

  • అధికార పార్టీ నుంచీ అందిన సహకారం

  • కోర్టు ఆదేశాలున్నా ప్రహరీ కూల్చేసిన కార్పొరేషన్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అధికారంలో ఉన్నప్పుడు పథకాల రూపంలో డబ్బులు పంచినా ప్రజలకు చేరువ కాలేకపోయిన వైకాపా, ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా పని చేయడంలేదన్న విశ్లేషకుల అభిప్రాయం తప్పని శ్రీకాకుళం వైకాపా నాయకులు నిరూపించారు. ఈ జిల్లాకు పెద్ద దిక్కయిన ధర్మాన ప్రసాదరావు మౌనమునిగా మారడంతో శ్రీకాకుళంలో ఆ పార్టీకి రెక్కలు తెగిపోయాయన్న భావనకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ధర్మాన రోడ్డెక్కకపోయినా, తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారని పార్టీకి, సిక్కోలు నియోజకవర్గానికి తెలియజెప్పే ఉదాహరణే ఇది. కొద్ది రోజుల క్రితం పొట్టి శ్రీరాములు పెద్దమార్కెట్‌ను కొట్టేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడంతో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన వైకాపా నేతలు అదే వేగంతో డీసీసీబీ కాలనీలో 80 అడుగుల రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలకు, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం దక్కలేదని ఆందోళన చేయడంతో ఈ కేసును వైకాపా నేతలు టేకప్‌ చేసి విజయం సాధించారు. స్థానికంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలిపి దీనికి రాజకీయ ప్రాధాన్యతను తీసుకురావడం వల్ల డీసీసీబీ కాలనీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పోరాటానికి విజయవంతమైన ముగింపు దక్కింది. వివరాల్లోకి వెళితే..


డీసీసీబీ కాలనీకి అనుకొని ఉన్న శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని నర్సెస్‌ కాలనీలో రోడ్డు ఆక్రమణపై 20 రోజులుగా స్థానికులు చేస్తున్న పోరాటానికి వైకాపా నాయకులు ఆదివారం సంఫీుభావం తెలిపారు. దీనిపై స్పందించిన అధికార యంత్రాంగం సోమవారం ఆక్రమించి నిర్మాణం చేసినట్టు ఆరోపణలు ఉన్న ప్రహరీని కూల్చివేశారు. ప్రహరీని కూల్చివేస్తున్న సమయంలో ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయొద్దని నగరపాలక సంస్థకు చెందిన సిబ్బంది హెచ్చరించినట్టు తెలిసింది. రోడ్డు ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్న స్థలంలో నిర్మించిన ప్రహరీపై సదరు యజమానులు న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాలతో కూడిన హెచ్చరిక నోటీసును అంటించారు. ఈ స్థలం వ్యవహారంలో మున్సిపాలిటీ గాని, స్థానికులు గాని జోక్యం చేసుకోకూడదనేది కోర్టు ఆర్డర్‌. అందువల్లే స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు ఆ ప్రాంతవాసులు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కానీ వైకాపా ఎప్పుడైతే స్థానికులకు మద్దతు తెలిపిందో మున్సిపాలిటీ ఈ నిర్మాణాలను కూల్చేసింది.

గత 20 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వార్డు మాజీ మెంబర్‌ బిర్లంగి రామ్మోహన్‌ నేతృత్వంలో ఆదివారం నిరసన చేపట్టారు. దీనికి వైకాపా నేతలు సంఫీుభావం ప్రకటించారు. 1984 మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం లేఅవుట్‌లో చూపించిన ఈ స్థలం ప్లాట్‌గా నిర్ధారిస్తూ ప్రహరీ నిర్మించుకోడానికి అన్ని అనుమతులూ ఇచ్చిన నగరపాలక సంస్థ అధికారులే ఇప్పుడు దీన్ని కూల్చివేయడం కచ్చితంగా సమష్టి విజయం. ఆదివారం వైకాపాతో పాటు టీడీపీ స్థానిక నాయకులు, సీపీఐ, కాంగ్రెస్‌, విశ్వహిందూ పరిషత్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం, తెలగ సంక్షేమ సంఘం స్థానికులకు సంఫీుభావం తెలిపారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించి ప్రహరీని తొలగించారని స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం వివాదాస్పద స్థలాన్ని, అందులో నిర్మించిన ప్రహరీని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతితో పాటు శ్రీకాకుళం రూరల్‌ మండలం ఎంపీపీ ప్రతినిధి అంబటి శ్రీనివాస్‌, ఎంపీపీ గొండు రఘురాం, మాజీ ఎంపీపీ చిట్టి జనార్ధన, ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా యువజన అధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌, బరాటం నాగేశ్వరరావు, బగ్గు అప్పారావు, సీపాన రామారావు, ఎచ్చెర్ల శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంవీ పద్మావతి మాట్లాడుతూ డీటీసీపీ అప్రూవడ్‌ లేఔట్‌లో రోడ్డుని ఆక్రమించడం ఎవరి వల్లా కాదని, అయితే అధికార పార్టీ నాయకుల అండతో రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. కలెక్టర్‌, కమిషనర్‌ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేయాల్సిన దుస్థితికి ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకువచ్చారని ఆరోపించారు. 20 రోజులుగా సమస్యను పరిష్కరించకుండా దాటవేయడంపై వైకాపా నాయకులు మండిపడ్డారు.

ఆక్రమణలు ఎక్కవయ్యాయి

టీడీపీ నాయకులు పీవీ రమణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా కార్పొరేషన్‌లో ఎన్నికలు జరగకపోవడంతో ఆక్రమణలు ఎక్కువయ్యాయని, కొన్ని వెలుగులోకి వస్తున్నాయని, మరికొన్ని మరుగున పడుతున్నాయన్నారు. డీసీసీబీ కాలనీలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అన్ని ఆధారాలతో స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. వివాదాస్పద స్థలాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పరిశీలించి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించినా మున్సిపల్‌ అధికారుల మౌనం వహించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి మాట్లాడుతూ ప్రహరీ గోడ ఆక్రమణ వెంటనే తొలగించి ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నామనే భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై అక్రమ కేసుల సాకుతో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డును పునరుద్ధరించాలని కోరారు. స్థానికులు బిందు, కృష్ణ, జొడ్డుమహంతి సంతోష్‌, గొప్పు సంతోష్‌, ఏయూఎస్‌ ప్రసాదరావు, భాగ్యలక్ష్మి, సనపల నర్సింగరావులతో పాటు నిరసనకు విశ్వహిందూ పరిషత్‌ నాయకులు ఆనందరావు, వైకాపా నాయకులు తంగి అప్పన్న, బైరి మురళి, ముంజేటి కృష్ణ, వానపల్లి రమేష్‌, కె.రమేష్‌, రఫీ, రాజు, తేజ, భరద్వాజ్‌, ఎం.తిరుపతిరావు తదితరులు సంఫీుభావం తెలిపారు.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page