top of page

విద్యావ్యవస్థలో మేలుమలుపు!

  • Guest Writer
  • Mar 17
  • 2 min read
  • పథకాలకు మహామహుల పేర్లు

  • రాజకీయ పార్టీల రంగు పడకుండా చర్యలు

  • పాఠశాల విద్యార్థుల యూనిఫారాల మార్పు

  • విద్యారంగంలో సంస్కరణల పర్వం

    కల్మషం లేని చిన్నారి మనసుల్లో భేదభావాలు, వైషమ్యాలు నాటుకుపోకుండా ఉండేందుకు ప్రాథమిక విద్యాభ్యాసం స్థాయి నుంచే ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. పేద, ధనిక, వర్ణ, కుల, మత తారతమ్యాలు వారి దరి చేరకుండా పాఠశాలల్లో అందరూ ఒకేలా కనిపించేలా, కలిసిమెలసి చదువుకునే వాతావరణం ఏర్పరిచేవి. కానీ కాలక్రమంలో రాజకీయ అధికారం వెర్రితలలు వేస్తూ విద్యాసంస్థలను కూడా రాజకీయ విషవలయంలోకి లాగుతూ చిన్నారి విద్యార్థుల మనసుల్లోకి రాజకీయ విషం చొప్పించే చర్యలకు పాల్పడటం అనుభవైకవేద్యం. విద్యార్థులకు అమలు చేసిన పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి పేర్లు పెట్టడం, పాఠశాలలకు అధికార పార్టీ పతాకాన్ని పోలిన రంగులు వేయించడం వంటివి విద్యాసంస్థలను రాజకీయ రొంపిలోకి లాగడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఎటువంటి రాజకీయ వాసనలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటం హర్షించదగ్గ పరిణామం. రాష్ట్ర మానవ వనరుల శాఖ(విద్యా శాఖ) మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్‌ విద్యారంగ నిపుణులతో చర్చిస్తూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ వరకు సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు.

థకాలకు కొత్త రూపం

గత ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని విద్యారంగ పథకాలకు అప్పటి అధికార పార్టీ అధినేత పేరు పెట్టడం తీవ్ర విమర్శలకు గురైంది. దానికి మించి విద్యార్థుల మనసుల్లో రాజకీయ విషబీజాలు నాటుతుందన్న ఆందోళన వ్యక్తమైనా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కాగా గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం, పథకాలకు పేర్లు పట్టడం పరిపాటిగా మారింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజకీయాల జోలికి పోకుండా మార్పులు చేస్తోంది. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ పథకానికి రాజకీయపరమైన పేరు కాకుండా గోదావరి జిల్లాల్లో బ్రిటీష్‌ హయాంలోనే గొప్ప అన్నదానశీలిగా పేరుప్రఖ్యాతులు పొందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ప్రశంసలు అందుకుంది. మరోవైపు పాఠశాల విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న విద్యాకానుక పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఇచ్చే కిట్‌లో యూనిఫారం, బెల్టు, బ్యాగు, షూస్‌, టై తదితర సామగ్రిలో పార్టీపరమైన రంగులు, బొమ్మలు లేకుండా సమూలు మార్పులు చేస్తోంది. పథకం పేరుతో ప్రముఖ విద్యావేత్త, భారత ప్రథమ ఉప రాష్ట్రపతి పేరుతో.. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌గా మార్చడం ముదావహం. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇచ్చ యూనిఫారాన్ని మార్చాలని నిర్ణయించారు. అదేవిధంగా బెల్టులు, బ్యాగుల రంగులు కూడా ఏ పార్టీ రంగులను పోలిన విధంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్పి విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షామోదాలతో స్వాగతిస్తున్నారు. కాగా ఈ అంశంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలపై కూడా దృష్టి సారించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఏడాది, రెండేళ్లకోసారి యూనిఫారాలను ఇష్టానుసారం మార్చేస్తూ, వాటి అమ్మకాల ద్వారా వ్యాపారం చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్‌ సంస్థల్లోనూ ఒకే రకమైన యూనిఫారం అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page