విపత్తుల జోన్‌లో అభివృద్ధి కేంద్రీకరణా?!
- DV RAMANA
- Apr 15
- 2 min read

ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజ ధాని ఎక్కడ నిర్మించాలన్నది సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో శివరామకృష్ణన్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించి కొన్ని ప్రాంతాలను సూచిస్తూ.. వాటి మంచీచెడులను కూడా తన నివేదికలో పొందుపర్చింది. సదరు కమిటీ సూచించిన ప్రాంతాల్లో అమరావతి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం వరదలు, భూకంపాలు, తుపానుల ప్రభావానికి గురయ్యే ప్రమాదముందని కమిటీ పేర్కొంది. అంతేకాదు.. రాయలసీమ ప్రాంతంలో రాజధాని నిర్మించడం సహజ న్యాయంగా ఉంటుందని, రాయలసీమలో రాజధానిని నిర్మిస్తే సీమాంధ్రుల శ్రీబాగ్ ఒప్పందం అమలై రెండు ప్రాంతాలకు సమన్యాయం జరిగినట్లు అవుతుందని పేర్కొంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా నిర్ణయించింది. అందుకే ప్రధాని మోదీ కేవలం ‘చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి’ ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అనాలోచిత నిర్ణయానికి సహకరించలేదు. అదే మోదీ, చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తిరిగి అమరావతినే భుజానికెత్తుకుని అభివృద్ధి కేంద్రీకరణే ఏకైక లక్ష్యంగా ముందుడుగు వేస్తున్న విషయం గమనించాలి. అమరావతి యావలో పడి పాత సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడగానే భారీ వరదలతో విజయవాడ, అమరావతి ప్రాంతాలను జలమయం చేయడం ద్వారా వరుణుడు మొదటి హెచ్చరిక జారీ చేశాడు. ఇప్పుడు భూకంపం రూపంలో మళ్లీ హెచ్చరికలు వస్తున్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి అమరావతిని రక్షించడానికి నగర నిర్మాణానికి ముందే రక్షణ కరకట్ట లకు, వరద నీటిని నేరుగా కృష్ణానదిలోకి మళ్లించడానికి నిర్మించే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులకు తెస్తున్న అప్పులు తీర్చడానికే రాష్ట్ర ప్రజలకు వందేళ్లు పడుతుంది. అలాంటప్పుడు ఎన్నో త్యాగాలు చేసి నేడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ఏం కావాలి. దీన్ని పట్టించుకో కుండా ఇపుడు మళ్లీ అమరావతి కోసం అదనంగా 44వేల ఎకరాల సేకరణకు కూటమి ప్రభు త్వం సిద్ధమవు తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్ర, రాష్ట్ర సంస్థలను నయానో భయానో అమరావతికి తరలిస్తున్నారు. రాజధాని విష యంలో తప్పు చేశామనే పశ్చాత్తాపం ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కనపడకపోవడం విచిత్రం. ప్రకృతి విపత్తులకు నిలయమైన అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 33వేల ఎకరాలు సేకరిం చడం ద్వారా రాష్ట్రంలోనే అతి సారవంతమైన, మూడు పంటలు పండే డెల్టా ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం ద్వారా బంగారు భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు మరో 44వేల ఎకరాల సేకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2014-19 కాలంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కడానికి బీజాలు వేస్తే నేడు అదే సర్కారు మరోసారి అమరావతిలోనే కేంద్రీకృతం చేయడానికి సిద్ధం చేస్తోంది. ఎన్నో త్యాగాలు చేసిన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల అన్యాయం జరుగు తున్నా బీజేపీ మౌనంగా ఉంది. 2018లో కర్నూలు నిర్వహించిన సమావేశంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌ను ఆ పార్టీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలి.. ఈ ప్రాంతంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి.. ఆరు నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. అధికారమంతా ఒకేచోట కేంద్రీకృతం చేయ వద్దు..’ తదితర డిమాండ్ల తో చేసిన రాయలసీమ డిక్లరేషన్ అమలుకు కృషి చేస్తామని ఆనాడు శపథం చేసిన బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు నేడు మౌనం వహించాయి. అసలు రాయల సీమ డిక్లరేషన్‌ను ఆమోదిం చామన్న విషయమైనా బీజేపీకి గుర్తుందో లేదో.. అనుమానమే. ఇది అవకాశవాదం కాదా? అమరావతి రాజధానిని ఇంకా విస్తరించేందుకు వీలుగా భూములు కబళించాలని రెండు చేతులు బార్లా చాస్తున్న కూటమి సర్కారు కేంద్రీకరణ చర్యలకు సహకరించడమంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయమైన చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా నాంది పలికినట్లవుతాయి. ఇలాంటి వాతావరణం నుంచే ప్రత్యేక రాష్ట్ర నినాదాలు పట్టుకొస్తుంటాయి. అందుకే ప్రభుత్వాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, అన్ని ప్రాంతాల సమగ్రాభి వృద్ధికి పూనుకో వాల్సిన అవసరం ఉంది.
Comments