top of page

విలీనం నుంచి విముక్తి.. అంత వీజీ కాదండోయ్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 15
  • 3 min read
  • పీటముడిగా మారిన ఏడు పంచాయతీల సమస్య

  • కేబినెట్‌ ముందుకు కుశాలపురం, తోటపాలెం గ్రామాల ఫైల్‌

  • మిగతా ఐదు గ్రామాల నుంచి పెరగనున్న ఒత్తిడి

  • కార్పొరేషన్‌ నుంచి మున్సిపాలిటీకి తగ్గించడం కూడా ఇబ్బందే

  • రాగోలు విలీనంతో ముందుకెళ్లాలన్న ఆలోచన



మున్సిపాలిటీగా ఉన్న శ్రీకాకుళానికి కార్పొరేషన్‌ హోదా కల్పించేందుకు విలీనం చేసిన పంచాయతీల జాబితా నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కుశాలపురం, తోటపాలెం పంచాయతీలు బయటపడనున్నాయి. మొదటి నుంచి శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనం కావడాన్ని మిగిలిన ఐదు పంచాయతీల మాదిరిగానే ఈ రెండు పంచాయతీలూ వ్యతిరేకించాయి. దీంతో వీటికి విముక్తి కల్పిస్తామన్న నినాదంతో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు పోటీ చేసి పెద్ద మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనను కేబినెట్‌లో ఆమోదింపజేసుకొని చట్టం తేవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం నాటి కేబినెట్‌ మీటింగ్‌లో ఈ అంశం ప్రస్తావనకు రాకపోతే మరో సమావేశంలోనైనా దీన్ని ఆమోదింపజేసుకుంటారు. ఈ రెండు పంచాయతీలు కార్పొరేషన్‌ నుంచి బయటకొచ్చేస్తే మిగిలిన ఐదు విలీన పంచాయతీలతో పాత మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇందులో సమాధానం లేని జవాబులెన్నో. ప్రజాప్రతినిధులకు కూడా దీని మీద కచ్చితమైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్నికలకు వెళ్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ చట్టం ఏం చెబుతోంది? న్యాయం ఎలా ఉంది? అన్న కోణాలను స్పృశిస్తే.. కార్పొరేషన్‌కే కాదు.. విలీన పంచాయతీలు బయటకొచ్చినా కూడా స్థానిక ఎన్నికలు జరగవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక లోతుల్లోకి వెళితే..

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్‌.ఈశ్వరరావు తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను నగరపాలక సంస్థ నుంచి బయటకు తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చారు. అంతకు ముందు వైకాపా ఈ రెండు పంచాయతీలను విలీనం చేసిన సమయంలో ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ప్రస్తుత చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు పంచాయతీలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ నుంచి మినహాయిస్తామని ఆ గ్రామ పెద్దలకు భరోసా ఇచ్చారు. వీరితో పాటు కుశాలపురం గ్రామంలో ఉన్న బీజేపీ సీనియర్‌ నాయకులు పైడి సాంబమూర్తి, తమ్మినేని గోవిందరావు తదితరులు నగరపాలక సంస్థలో గ్రామాన్ని విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి లేఖలు రాశారు. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆయా గ్రామాల ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు సూచనప్రాయంగా వెల్లడిరచారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి జెడ్పీలో నిర్వహించిన అధికారుల సమీక్షలో శ్రీకాకుళం నగరపాలక సంస్థలో రాగోలు గ్రామ పంచాయతీని విలీనం చేయాలన్న ఆలోచనను బయటపెట్టారు. దీంతో తోటపాలెం, కుశాలపురం గ్రామాలు శ్రీకాకుళం నగరపాలక సంస్థ నుంచి తీసేయాలని ఆ రోజే నిర్ణయించారు.

స్పందించిన సీఎంవో

మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే గొండు శంకర్‌ల అభిప్రాయంతో ఏకీభవించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకు 2024 నవంబర్‌ 11న సీఎం చంద్రబాబు పేషీకి, మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణకు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన సీఎం పేషీ ఎమ్మెల్యే ఈశ్వరరావు రాసిన లేఖను ఈ ఏడాది ఫిబ్రవరి 17న పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టి రెండు పంచాయతీలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ నుంచి డీనోటిఫై చేసేలా తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆర్డినెన్స్‌ తెచ్చి ఆరు నెలల్లో చట్టం చేయాల్సి ఉంటుంది. చట్టం అయితే ఈ రెండు పంచాయతీలకు ఎన్నికలు జరుపుకోవచ్చా? అలాగే మిగిలిన ఐదు పంచాయతీలతో కార్పొరేషన్‌ ఎన్నికలకు వెళ్తుందా? అనేది ఇక్కడ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. న్యాయనిపుణులు మాత్రం చట్టం చేసినా ప్రస్తుతం పెండిరగ్‌లో ఉన్న కేసు ఉపసంహరించడానికి వీలుపడదంటున్నారు. ఈ రెండు పంచాయతీలతో పాటు మిగతా ఐదు పంచాయతీలకు చెందినవారు ఇందులో ఇంప్లీడ్‌ అయివున్నారు.

పెండిరగ్‌లో రెండు పిటిషన్లు

2013లో జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌లో ఏడు పంచాయతీలను మినహాయించి ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. దీనిపై పాత్రునివలస, ఖాజీపేట, తోటపాలెం, కుశాలపురానికి చెందినవారు మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నాలుగు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఎన్నికలు నిర్వహించారు. వీరి పదవీకాలం 2018 ఆగస్టుతో ముగిసింది. పంతానికి పోయిన అప్పటి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారులను పంపించి, పంచాయతీ తీర్మానాలు చేసి ఈ నాలుగు పంచాయతీలను విలీనం చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2020 కరోనా కాలంలో వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌ కోసం ఒక్క రోజు సమావేశపరిచిన శాసనసభలో ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ చట్టం చేసింది. చట్టాన్ని కోర్టులో సవాల్‌ చేయడం కుదరదని, చట్టం చేసే పద్ధతిలో లోపాలుంటేనే కోర్టుకు రావాల్సి ఉంటుంది కాబట్టి ఏడు పంచాయతీల నుంచి వేసిన పిటిషన్‌ చెల్లదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో కోర్టు సూచనల మేరకు అందరూ కలిసి చట్టంపై రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2021 మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసినా, అందులో ఈ ఏడు పంచాయతీలను మినహాయించారు. అదే సమయంలో నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడగా.. కోర్టులో కేసు ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని మరోమారు న్యాయస్థానం తలుపు తట్టారు. దీంతో కోర్టు తీర్పు వెలువడేంతవరకు ఏడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇక కార్పొరేషన్‌లో డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే సమయంలో నగరంలో ఉన్న దళితుల సంఖ్యను తక్కువగా చూపించారంటూ కొందరు దళిత సంఘాల నాయకులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ రెండూ హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కోర్టు నుంచి విత్‌డ్రా అయితే గానీ ఎన్నికలు జరిపే అవకాశం లేదు. తోటపాలెం, కుశాలపురం మాదిరిగానే శ్రీకాకుళం రూరల్‌లో ఉన్న మిగిలిన ఐదు పంచాయతీలు కూడా తాము మున్సిపాలిటీలో కలిసే ప్రసక్తి లేదంటున్నాయి. కార్పొరేషన్‌లో కలిస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు ఆగిపోతాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కాస్తో కూస్తో పనులు జరుగుతున్నాయి కాబట్టి కార్పొరేషన్‌లో కలవబోమంటున్నారు. కానీ పార్టీతో సంబంధం లేకుండా నేతలంతా ఇవి పేరుకే పంచాయతీలు గానీ, నగరానికి ఆనుకొనే ఉన్నాయని, ఇక్కడ భారీ భవంతులు ఉండటం వల్ల రోడ్డు, తాగునీరు, కాలువలు వంటి సౌకర్యాలు కల్పించాం కాబట్టి కార్పొరేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. ఇక్కడ ప్రజలు కూడా కార్పొరేషన్‌లో చేరితే పన్నులు పెరిగిపోతాయని స్థానిక నాయకుల మీద ఒత్తిడి తెస్తున్నారు.

రాగోలు విలీనంపై చర్చ

దళితుల జనాభాపై హైకోర్టులో దాఖలైన దావా జనగణన పూర్తయ్యేవరకు తేలదు. ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనిపై నియమించిన ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు నగరపాలక సంస్థలో దళితుల జనాభా వివరాలు బయటపడతాయి. అంతవరకు న్యాయస్థానంలో దళిత సంఘాలు వేసిన దావా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో పాటు కుశాలపురం, తోటపాలెం పంచాయతీలను నగరపాలక సంస్థ నుంచి తొలగిస్తే 50 డివిజన్లు 48 డివిజన్లకు తగ్గిపోతాయి. దీంతో మళ్లీ 50 డివిజన్ల హద్దులను మార్చాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ నేతల ఆలోచనలో భాగంగా రాగోలు గ్రామ పంచాయతీని విలీనం చేయడానికి కసరత్తు చేస్తే, దాన్ని రెండు డివిజన్లుగా మార్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రెండు పంచాయతీలు బయటపడిన వెంటనే శ్రీకాకుళంలో ఉన్న ఐదు పంచాయతీలను కూడా అదే మాదిరిగా బయటకు తేవాలన్న ఒత్తిడి నాయకుల మీద పెరుగుతుంది. కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపాలంటే పాత మున్సిపాలిటీలో 36 వార్డులనే పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలి. లేదూ పంచాయతీలతో కలిపి నిర్వహించాలంటే కోర్టు కేసులు విత్‌డ్రా చేయించాలి. ఒకసారి కార్పొరేషన్‌ అయిన తర్వాత దాని నిధులు, విధుల్లో చాలా మార్పులు వస్తాయి. కార్పొరేషన్‌ పేరుతో ఇన్నాళ్లూ వసూలుచేసిన పన్నులను ఇప్పుడు మున్సిపాలిటీ అయితే తగ్గించాల్సి ఉంటుంది. ఇందులో తేడాలు వస్తే మరికొందరు కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఏతావాతా తేలేదేమంటే.. త్వరలోనే మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయని ఇంకా ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page