top of page

వజ్జ బాబూరావుకు రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి

  • Writer: ADMIN
    ADMIN
  • Sep 24, 2024
  • 1 min read

20 మంది లిస్టు ప్రకటించిన కూటమి ప్రభుత్వం



కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవుల్లో పార్టీ కోసం పని చేసిన 20 మందిని గుర్తించింది. ఇందులో భాగంగా పలాస`కాశీబుగ్గకు చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావుకు రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) చైర్మన్‌ పోస్టును కట్టబెట్టింది. వజ్జ బాబూరావు 2002లో పలాస`కాశీబుగ్గకు మొదటి మున్సిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పయ్యదొర, కణితి విశ్వనాధం లాంటి తలపండిన కాంగ్రెస్‌ నేతల శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బాబూరావు హయాంలో పలాస`కాశీబుగ్గకు నిధుల వరద పారించారు. ఆ సమయంలో రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాలలో బీకాం పూర్తిచేసిన వజ్జ బాబూరావు ఆ తర్వాత ఎం`కామ్‌ చదివారు. 1994లో ఎన్టీ రామారావు రెండుచోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి టెక్కలి కాగా, ఆ ఎన్నికల్లో రామారావు మీద కాంగ్రెస్‌ అభ్యర్థిగా వజ్జ బాబూరావు పోటీ చేశారు. 40వేల మెజార్టీతో ఎన్టీ రామారావు గెలిచారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎన్టీ రామారావు మీద కణితి విశ్వనాధం పోటీ చేయాలని పీవీ నర్సింహారావు భావించారు. కానీ తనకొక ప్లాట్‌ఫామ్‌ ఉందని, తన శిష్యుడు వజ్జ బాబూరావు పోటీ చేస్తారని ఒప్పించడంతో బాబూరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేసిన వజ్జ బాబూరావు 2009లో జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారని తెలుసుకున్న వెంటనే పీసీసీ సెక్రటరీగా తన పదవికి రాజీనామా చేసి జగన్‌ వెంట నడిచారు. 2014లో జగన్‌ పార్టీ తరఫున పలాస నుంచి పోటీ చేసి వర్గపోరులో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకు, ఆయనకు మధ్య గ్యాప్‌ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫ్లెక్లీలు, పోస్టర్లు తగులబెట్టేశారంటూ జగన్మోహన్‌రెడ్డికి వైకాపాలో కొందరు పితూరీలు చెప్పడంతో బాబూరావు స్థానంలో జుత్తు జగన్నాయకులును వైకాపా ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమైన బాబూరావు తెలుగుదేశంలో చేరిపోయారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సిన సంస్థలు ముందుగా ఏపీటీపీసీని కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కీలక పదవిలో వజ్జ బాబూరావును నియమించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page