సంక్షేమ శాఖలో మోసాల ‘విశ్వ’రూపం!
- BAGADI NARAYANARAO
- 9 hours ago
- 3 min read

వైకాపా హయాంలో లాబీయింగ్‌తో జిల్లాకు రాక
అవినీతి, అక్రమాలతో రెచ్చిపోతున్న డీడీ
సీనియార్టీని కాదని గ్రేడ్`1 ప్రమోషన్లు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపునకు వసూళ్లు
ఫిర్యాదు చేసిన వారిపై కక్షపూరిత చర్యలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇంకా వైకాపా వాసనలు పోని సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డిపై అధికార కూటమి పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పనిచేసిన ప్రతి చోటా వివాదాస్పదుడన్న ముద్ర వేసుకున్న ఈయన వైకాపా అధికారంలో ఉన్నప్పుడు తమ శాఖ డైరెక్టరేట్‌లో పోస్టు ఆశించారు. కానీ పలు అభియోగాలున్న ఆయనకు అది దక్కలేదు. దీంతో అప్పటి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిని కలిసి శ్రీకాకుళానికి పోస్టింగ్ ఇప్పించుకున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను బదిలీ చేశారు. కానీ ఒక మంత్రి ఓఎస్డీ ద్వారా విశ్వమోహన్‌రెడ్డి ఆ బదిలీ నుంచి తప్పించుకున్నారంటున్నారు. ఇందుకు రూ.4లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. జిల్లాకు రాకముందు అనంతపురం డీడీగా పనిచేసిన విశ్వమోహన్‌రెడ్డి ఒక మహిళా వార్డెన్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు రావడంతో అయన్ను ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారని సమాచారం. ముప్పయ్యేళ్ల సర్వీసులో సదరు అధికారి డీడీ స్థాయిని దాటి వెళ్లలేకపోయారంటే ఆయన పనితనం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. విశ్వమోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పటి నుంచి స్థానిక అంబేద్కర్ ఆడిటోరియం అద్దె వసూళ్లకు లెక్కలు లేకుండాపోయాయని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల ద్వారా బెదిరింపు యత్నాలు
సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా జిల్లాలో మూడేళ్లు పూర్తి చేసుకున్న విశ్వమోహన్‌రెడ్డి అనేక రూపాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రేడ్`1 ఉద్యోగుల ప్రమోషన్లలో సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా, డిపార్ట్‌మెంట్ టెస్టులు రాయకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బీఈడీ చేసి, డిపార్ట్‌మెంట్ టెస్టు ఉత్తీర్ణులైన వారికే గ్రేడ్`1 ప్రమోషన్ ఇవ్వాలని మార్గదర్శకాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి టీటీసీ చేసిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లోనూ పెద్ద మొత్తంలో వెనుకేసుకున్నారని తెలిసింది. దీనిపై ఈ నెల తొమ్మిదో తేదీన ఎల్.ఎన్.పేట మండలం మోదుగులవలసకు చెందిన టీడీపీ మద్దతుదారుడు తవిటినాయుడు చేసిన ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్ దానిపై విచారణ జరపాలని ఆదేశిస్తూ కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతిని నియమించారు. ఆ మేరకు ఈ నెల 22న కలెక్టరేట్‌లో జరిగిన విచారణకు బాధితులతో కలిసి తవిటినాయుడు హాజరయ్యారు. అయితే తవిటినాయుడు విచారణకు హాజరు కాకుండా చేసేందుకు డీడీ విశ్వమోహన్‌రెడ్డి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ చేయించినట్టు తెలిసింది. డీడీ నుంచి ఫిర్యాదు వచ్చిందని, తక్షణమే స్టేషన్‌కు రావాలని సదరు పోలీస్ అధికారి తవిటినాయుడుకి ఫోన్ వెళ్లింది. ఆ సమయంలో ఆయన విచారణ అధికారి వద్ద వాంగ్మూలం ఇస్తున్నారు. అక్రమాలు, అవినీతిపై ఫిర్యాదు చేస్తే బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తారా అని తవిటినాయుడు పోలీసులను ప్రశ్నించినట్లు తెలిసింది. తమ హక్కులను కాలరాస్తున్నారంటూ పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో పోలీసు అధికారి ఫోన్ కట్ చేసినట్టు తెలిసింది.
ఫిర్యాదు చేసిన వార్డెన్‌కు వేధింపులు
మరోవైపు నరసన్నపేట కాలేజీ బాలుర వసతి గృహం వార్డెన్ తారకేశ్వరరావు విషయంలోనూ డీడీ విశ్వమోహన్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. డీడీపై విచారణ రోజు తారకేశ్వరరావు విచారణాధికారి పద్మావతిని కలిసి ప్రమోషన్ విషయంలో జరిగిన అన్యాయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లకు పైగా సీనియార్టీ ఉన్న హెచ్‌డబ్ల్యూవో తనకు కాకుండా 2013లో సర్వీసులో చేరిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోస్టర్ పాటించకుండా సీనియార్టీ జాబితాలో 54వ సీరియల్ వరకు ఒకలా నిర్వహించి.. 55వ స్థానంలో ఉన్న తనకు కాకుండా ఎక్కడో 74వ స్థానంలో ఉన్న వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా డీడీ విశ్వమోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో తారకేశ్వరావు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన తారకేశ్వరరావును అప్పటి నుంచి విశ్వమోహన్‌రెడ్డి వేధింపులకు, బెదిరింపులకు గురి చేశారని తెలిసింది. తారకేశ్వరరావు వార్డెన్‌గా ఉన్న వసతిగృహంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి తనిఖీలు చేయాలని కోరినట్టు తెలిసింది. ఏదో ఒక ఆరోపణతో తారకేశ్వరరావును దోషిగా నిలబెట్టడానికి డీడీ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవుట్ సోర్సింగ్ జాబితా కుదింపు
వైకాపా హయాంలో వసతిగృహాల్లో 37 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించగా, కరోనా సమయంలో కొందరు విధుల నుంచి తప్పుకున్నారు. మిగిలిన వారికి కరోనా అనంతరం విధుల్లోకి తీసుకునేందుకు మొదట 15 మందితో జాబితా రూపొందించారు. యూనియన్ నాయకులు, కొందరు వార్డెన్లతో కలిసి డీడీ వారి నుంచి రూ.2.50 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. వీరిలో డీడీతో ఒప్పందం చేసుకున్న ప్రసాద్ అనే వ్యక్తి రూ.2.30 లక్షలు మాత్రమే ఇవ్వగలిగాడు. మిగతా రూ.20 వేలు ఇవ్వలేకపోవడంతో అతన్ని జాబితా నుంచి తప్పించి 14 మందితోనే జాబితాను సిద్ధం చేసినా, ఆతర్వాత దాన్ని 12కు కుదించారు. అవుట్ సోర్సింగ్ నియామకాలకు డీడీ డబ్బులు వసూలు చేశారని ఈ నెల తొమ్మిదో తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ జాబితాను ఎనిమిది మందికి కుదించారు. ఈ తతంగం ఏడాదిన్నరగా కొనసాగుతోంది. వీరందరినీ విధుల్లోకి తీసుకోవాలని మంత్రి లోకేష్ ఉత్తర్వులు జారీచేయడంతో జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్కడే డీడీ విశ్వమోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు ఆ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
అవి ఉత్తుత్తి ఫిర్యాదులట!
డీడీ అక్రమాలపై విచారణ నిర్వహించిన ఎస్‌డీసీ పద్మావతికి తారకేశ్వరరావు, ఇతర బాధితులు ఆధారాలు, వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవల్సిన డీడీ విశ్వమోహన్‌రెడ్డి మాత్రం తనను తాను సమర్ధించుకోవడానికి 1999లో ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ మెమో 706లో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ.. దాని ప్రకారం జిల్లాస్థాయి అధికారినైన తనపై కిందస్థాయి అధికారులు, ఉద్యోగులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, వాటిని ఉత్తుత్తి ఫిర్యాదులుగా గుర్తించాలని విచారణాధికారిని కోరినట్లు తెలిసింది. మరోవైపు విచారణాధికారిని ప్రభావితం చేయడానికి డీడీ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుదారులను, బాధితులను బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments