top of page

సంఖ్యాధిక్య బీసీలకు రాజ్యాధికారం కలే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 31
  • 2 min read

రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న అగ్ర కులాలే రాజ్యధికారం అనుభవిస్తున్నాయి. సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాజ్యాధికారం దక్కడం లేదంటూ ఒక నేత తన పార్టీకి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలోని గణాంకాలు పాతవే, వాస్తవాలే అయినా రాష్ట్రంలో బీసీ ఉద్యమం వచ్చే పరిస్థితి లేదు. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పరిస్థితులు మారక పోయినా తెలంగాణలో కులాల కుంపట్లు లేని రాజకీయాలు నడుస్తున్నాయి. వెనుకబడిన కులాల్లో చైతన్యం కనిపిస్తోంది. అది భవిష్యత్‌లో బీసీ ఉద్యమానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రలో పరిస్థితి దీనికి భిన్నం. కులాల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది. ఆర్ధికంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రాజకీయాలను శాసిస్తూ వస్తోంది. అధికార వ్యవస్థ వారి మాట వినాల్సిందే.. ఆ కుటుంబాలకు ఉన్న భూయాజమాన్య హక్కులతో పాటు ఆర్థిక ఎదుగుదలే దానికి కారణం. అందుకే ఏ గ్రామంలో చూసినా కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, కొన్నిచోట్ల వెలమ వర్గాల డామినేషన్‌ కనిపిస్తుంది. మిగిలిన కులాల నుంచి కొందరు నేతలున్నా రాజ్యాధికారంలో కమ్మ, రెడ్డిలదే శాసనం. బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారు తమ వర్గాలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అగ్ర కులాలతో అంటకాగుతూ బీసీలకు న్యాయం చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తమకు సీటిచ్చిన పార్టీలకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో పార్టీల వద్ద బీసీల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ జాబితాలో 139 దాకా ఉప కులాలు ఉన్నా వాటి మధ్య ఐక మత్యం లేకపోవడం వల్ల రాజ్యాధికారం అందకుండాపోతోంది. బీసీ ప్రజల్లో రాజ్యాధికార కాంక్ష లేకపోవడం కూడా దీనికి మరో కారణం. రాష్ట్రంలో రెడ్లు 20,84,416 ఉండగా, స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఆ కులం నుంచి ఏకంగా 658 మంది ఎమ్మెల్యేలయ్యారు. 14,32,725 జనాభా ఉన్న కమ్మ వర్గం నుంచి 549 మంది, 41,73,211 మంది జనాభా ఉన్న కమ్మ కులం నుంచి 314 మందే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అదే సమయంలో తూర్పు కాపు జనాభా 16 లక్షల పైగా ఉంటే వారి నుంచి 80 మంది, 24 లక్షల జనాభా ఉన్న ముస్లిం షేక్‌ల నుంచి 54 మంది, 10 లక్షల వరకూ ఉన్న గౌడల నుంచి 50 మంది, 26 లక్షల జనాభా ఉన్న యాదవుల నుంచి 46 మంది, 8 లక్షలుగా ఉన్న పద్మశాలీల నుంచి 21 మంది, 5 లక్షల జనాభా ఉన్న 18 మంది, 13 లక్షల జనాభా ఉన్న వాల్మీకి బోయ వర్గం నుంచి 17 మంది, 12 లక్షల వరకూ ఉన్న రజక వర్గం నుంచి ఒక్కరు ఎమ్మెల్యే అయ్యారు. 10 లక్షల జనాభా వడ్డెర్లకు అసెంబ్లీలో ఇంతవరకు ప్రాతినిధ్యం లభించలేదు. బీసీల్లో రాజకీయంగా రాణించినవారు లేరా అంటే చాలామందే ఉన్నారు. గౌతు లచ్చన్న, ప్రగడ కోటయ్య లాంటి నేతలు సామాజికంగా, రాజకీయంగా సత్తా చాటారు. అణగారినవర్గాల ఆశాజ్యోతి గా గౌతు లచ్చన్న రాణించిన తీరు.. ఆయనకు సర్దార్‌ పేరు వచ్చేలా చేసింది. లచ్చన్న అత్యంత వెనక బడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎపుడూ అధికార పార్టీల విధానాలనే విమర్శించారు. తన జీవితం మొత్తం బడుగు, బల హీనుల కోసం అంకితం చేసిన నేత. అటువంటి నేతలను కూడా పార్టీల పరంగా వాడేసుకున్నారు.. వాడుకుంటున్నారు కూడా. బీసీ లీడర్లంతా తమకు వచ్చిన అవకాశాలతో తమ సామాజికవర్గాల, బడుగుల శ్రేయస్సు కోసం పనిచేశారే తప్ప బీసీలకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్‌ను ఎప్పుడూ తీసుకు రాలేదు. ఆ తర్వాత బీసీ నేతలుగా ఎదిగిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు, మరికొందరి రాజకీయ ప్రస్థానం కూడా అదేరీతిలో సాగింది. ప్రస్తుతం పార్టీల వారీగా ప్రజాప్రతినిధులుగా ఉన్న బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా పార్టీ గీతకు లోబడే రాజకీయాలు చేయగలుగుతున్నారే గానీ, దాని పరిధి దాటి తమ కులానికో, మొత్తం బీసీ వర్గాలకో రాజకీయ ప్రయోజనం కల్పించే ప్రయత్నాలకు సాహసించలేకపోతున్నారు. ఆ పరిస్థితి ఏపీలోని ఏ పార్టీలోనూ మచ్చుకైనా కనిపించదు. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కొన్ని కులాల అధిపత్యమే కనిపిస్తుంది. జనాభాపరంగా ఆ గ్రామంలో అధిక సంఖ్యలో లేకపోయినా గ్రామంలో ఉన్న ఒకటి రెండు పెత్తందారీ కుటుంబాల వారే రాజకీయ ఆధి పత్యం చెలాయిస్తుంటారు. స్థానిక రాజకీయాలతో పాటు, అధికారులను శాసిస్తారు. పాలకవర్గంతో సత్సంబంధాలు నెరుపుతూ గ్రామంలో అందరినీ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. సంఖ్యాధిక్యత ఉన్న బీసీ వర్గాలు కూడా వారి ఆధిపత్యంలో ఒదిగిపోయి అనుచరులుగా కొనసాగుతూ తమ ప్రత్యేకతను కోల్పోతుంటారు. ఈ ధోరణే బీసీ ఉద్యమానికి చేటు చేస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page