సైలెంట్ మోడ్‌లోకి వైకాపా నేతలు
- NVS PRASAD
- Oct 4, 2024
- 3 min read
కేసులకు భయపడొద్దంటున్న జగన్
ఓడితే గాని అధ్యక్షుడికి తత్వం బోధపడలేదు
టీడీపీ పాలనపై నోరెత్తమంటున్న కేడర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతలు సైలెండ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కేవలం తమకు 11 స్థానాలు మాత్రమే వచ్చాయన్నది వీరి బాధ కాదు. 40 శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీలో ఉన్నామని బయటకు చెబుతున్నా, గడిచిన ఐదేళ్లలో పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ మాటను ఏమాత్రం పట్టించుకోలేని కోపాన్ని మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా సెలెంట్ మోడ్‌లో వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కినప్పుడు వాస్తవానికి జగన్మోహన్‌రెడ్డి ఒంటరేనని అర్థమైంది. అయితే ఒకటికి రెండుసార్లు టీడీపీతో పాటు కూటమి నేతలు కెలకడం వల్ల సైలెంట్ మోడ్‌లో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని లాంటి ఒకరిద్దలు బయటకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇచ్చి వెనక్కు వెళ్లిపోయారు. కారణం.. తాము మంత్రులుగా ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రీంగా వ్యవహరించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి మాటే చెల్లుబాటు కావడం. టీటీడీ బోర్డు చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పని చేయడం వల్ల ఈ కల్తీలో తమ పాత్ర లేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు తప్ప రాజకీయంగా జగన్‌కు తోడు నిలిచిన నాయకులు కనపడలేదు. దీనికి కారణం ప్రధానంగా జగనే. కేవలం సలహాదారుల మాటలు విని మంత్రిస్థాయి నాయకులు కూడా తనను కలిసే అవకాశం లేకుండా చేసుకున్న జగన్ కోసం ఎందుకు మాట్లాడాలన్న భావన నాయకుల్లో ఉంది. పార్టీ మారే అవకాశం లేకపోయినా జగన్‌కు తెలిసిరావాలన్న కోణంలోనే రాష్ట్రంలో అనేకమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అప్పటి మాదిరిగానే ఇప్పుడూ ఒక భజన బృందం జగన్ వెనుక నడుస్తోంది. వీరి వల్ల పార్టీకి పైసా ప్రయోజనం ఉండదు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఉన్న వైఫల్యాలను ఎత్తి చూపడానికి కూడా ఎక్కడా కడర్ ముందుకు రావడంలేదు. వీరంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని మరోసారి గుర్తుచేసుకోవాలి. కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పంతం నానాజీ అక్కడే ఒక దళిత వైద్యుడిపై దాడి చేస్తే, కనీసం కాకినాడలో వైకాపా నాయకులు ప్రెస్‌మీట్ కూడా పెట్టలేకపోయారు. అదే వైకాపా హయాంలో ఇలాంటి దళిత డాక్టర్ సుధాకర్‌ను వైకాపా నేతలే పొట్టన పెట్టుకున్నారని టీడీపీ ఏకంగా ఉద్యమాన్నే నడిపింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కేసులకు భయపడొద్దని, తనను 16 నెలలు జైలులో పెట్టి హింసించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని తన కేడర్‌కు భగవద్గీత చెబుతున్నారు. కానీ 2014`19 మధ్యకాలంలో జగన్మోహన్‌రెడ్డి కోసం జైలుకెళ్లిన, కేసులు మోసిన ఎంతమంది కార్యకర్తలను ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విముక్తిక కల్పించారో చెప్పుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంట నడిచిన భూస్వాములు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవాలి. అధికారంలో లేనన్నాళ్లూ బట్టలు చించుకున్న నేతలు, అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డిని గాని, స్థానిక పెద్ద నాయకులను గాని కనీసం కలిసే పరిస్థితి లేకుండాపోయింది. రాజశేఖరరెడ్డి హయాంలో గానీ, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో గానీ ఇలా రోడ్డున పడిపోయిన కార్యకర్త కనపడడు. ఒకసారి కాకపోతే ఒకసారైనా గుర్తింపునకు నోచుకున్నారు. నిన్నకాక మొన్న స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాగోలుకు చెందిన సీర రమణయ్యను నియమించడమే ఇందుకు నిదర్శనం.
ఓడితే గానీ ‘అనుబంధం’ తెలియలేదు!
జగన్ మోహన్ రెడ్డికి ఓటమి వస్తే కానీ పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాలు గుర్తుకు రాలేదు. అద్దాల మేడలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఒక ఓటమి భూమి మీదకు తెచ్చింది. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ భజన చేసి కీర్తించేవారు ఎక్కడకు పోయారో తెలియదు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు, సచివాలయం నా మానస పుత్రికలంటూ నిరంతరం మాట్లాడే జగన్ పార్టీలో మొన్న అనుబంధ విభాగాలతో మీటింగ్ పెట్టడం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఐదేళ్లు అధికారం ఉంటే పరదాలు కట్టి తిరిగినప్పుడు కార్యకర్తలు గుర్తు లేరా? సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే సోషల్ మీడియా కార్యకర్తలు గుర్తు లేరు. బద్వేల్, తిరుపతి ఉప ఎన్నికల్లో కరోనా వచ్చి చనిపోయినవారు గుర్తున్నారా? ఉప ఎన్నికలలో పని చేసి కరోనా వచ్చి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నవారు గుర్తు ఉన్నారా? ఒక్కరినైనా పలకరించారా? జగన్ కోసం ఎవరు పని చేశారో, చేస్తున్నారో కనీసం గుర్తున్నారా? కేవలం ఆ నలుగురు తప్ప ఎవరు గుర్తు లేరు. 2019ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతి మీటింగ్‌లో అధికారంలోకి వస్తే కార్యకర్తల అందరి జీవితాలు తాను మారుస్తా అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల జీవితాలు నాశనం చేసి ఆయన చుట్టూ ఉన్న నలుగురి జీవితాలు మార్చారు. జగన్ పాలనలో బాగుపడినది కేవలం భజనపరులు, అధికారులు మాత్రమే. జగన్ ముందు రివ్యూ చేయాల్సింది అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ఆర్బికే, హెల్త్ సెంటర్లు, బల్క్‌మిల్క్ సెంటర్లు, ప్రహరీ గోడలు కట్టిన వైకాపా కార్యకర్తలతో మాట్లాడాలి. మున్సిపాలిటీలో వందల కోట్లు బిల్లులు పెండిరగ్ పెట్టిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో మాట్లాడితే చాలా స్పష్టంగావారి బాధలు అర్థమవుతాయి. పులివెందుల నియోజకవర్గ మున్సిపాలిటీలో ఎంత బిల్లులు పెండిరగ్ పెట్టారో ఓడిపోయిన తర్వాత జగన్ పులివెందులకు వెళ్తే గానీ తెలియలేదు. అనుబంధ విభాగాలతో మా చెవిరెడ్డెన్న చూసుకుంటాడు.. రామకృష్ణారెడ్డి అన్న చూసుకుంటాడు.. సాయిరెడ్డెన్న చూసుకుంటాడు.. ధనుంజయ రెడ్డన్న చూసుకుంటాడు.. నా పీఏ కెఎన్నార్ చూసుకుంటాడు.. అనకపోవడమే సంతోషం. 15 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమిస్తే, అందులో పాతవారు దాదాపు 12 మంది ఉన్నారు. ముగ్గురిని కొత్తవారిని నియమించారు. ఇంకా పార్టీలో కొత్త వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారు?
Comments