స్వర్గానికేగిన సేవామూర్తి
- DV RAMANA
- Apr 17
- 4 min read
రక్త సంబంధీకులు.. అందులోనూ కన్నపిల్లలు చిన్న వయసులోనే మరణిస్తే ఎంతటివారైనా గర్భశోకంతో కుమిలిపోతారు. దైనందిన జీవితాన్నే మర్చిపోతారు. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. కన్నకూతురు అర్థంతరంగా తమను.. ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయిందన్న పుట్టెడు దుఃఖంతో కుంగిపోయినా.. దూరమైన కుమార్తెను సమాజ సేవలో చూసుకోవాలనుకున్నారు. దానికి కార్యరూపమే సీవీ నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ. తన యావదాస్తిని, పెన్షన్ సొమ్ములో సింహ భాగాన్ని కూడా ఈ సొసైటీకి విరాళంగా ఇచ్చేసి.. ఆ ఛత్రం కింద వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంతో పాటు చేతికి ఎముక లేదన్నట్లు లక్షలాది మందికి దానధర్మాలు చేసి సేవామూర్తిగా.. మనుషుల్లో దేవుడిగా మన్ననలు అందుకున్నా మహోన్నతుడు చెరుకుపల్లి వరహా నరసింహమూర్తి (సీవీఎన్ మూర్తి). ఆయన సేవా తత్పరతను గుర్తించి నాలుగేళ్ల క్రితం ‘సత్యం’ పత్రిక ‘మనుషుల్లో దేవుడు’ అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించింది. కాగా 82 ఏళ్ల ఈ మూర్తిగారు భువిలో అందిస్తున్న సేవలు దివిలో కూడా అవసరమని దేవుడు భావించి తీసుకుపోయాడో లేక తన కుమార్తె చెంతకు వెళ్లాలని ఆయనే అనుకున్నారో గానీ.. మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచిన ఆయన సేవలకు అంతిమ నివాళిగా.. గతంలో ‘సత్యం’ ప్రచురించిన కథనం యథాతథంగా అందజేస్తున్నాం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఓ పెద్దాయన కంటి సమస్యకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు పరిశీలించి శస్త్ర చికిత్స చేయాలంటూ.. అందుకు రూ.15 వేలు, రూ.60వేలు అయ్యే రెండు రకాల ప్యాకేజీలు ఉన్నాయని చెప్పారు. దానికా పెద్దాయన రూ.15వేల చికిత్స చేయించుకుందాం. మిగతా డబ్బులు అభాగ్యులెవరికైనా ఉపయోగపడతాయి కదా.. అని తనతో పాటు వచ్చిన మిత్రుడితో అన్నారు.
..ఇది ఆయన పరోపకార బుద్ధికి నిదర్శనం.
తన ఇంటి ఎదుట ఓ శునకరాజం పిల్లలు పెట్టింది. తుప్పల్లో.. చీమలు, పురుగుల మధ్య ఇంకా కళ్లు తెరవని ఆ చిన్ని పప్పీలను చూసి తట్టుకోలేక.. సదరు శునక కుటుంబానికి ఆశ్రమిచ్చి.. చివరికి తన ఇంటినే శునకాశ్రమంగా మార్చేశారు..
..ఇంతటి దానగుణ సంపన్నులు, భూతదయాళులు నేటి సమాజంలో ఎవరైనా ఉంటారా?..
ఒక్క చెరుకుపల్లి వరహా నర్సింహమూర్తి తప్ప!..
బతకులేక బడి పంతులు.. అని మన ముందు తరాలవారు చెప్పుకోనే కాలంలో అలాంటి ఓ సాధారణ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించి.. స్వయంకృషితో ఉద్యోగ జీవితంలో చీఫ్ ఇంజినీర్ స్థాయికి ఎదిగినా.. ఇప్పటికీ సాధారణ జీవితమే గడుపుతూ.. తన సంపాదన, అత్తగారి నుంచి సంక్రమించిన ఆస్తి.. అన్నింటినీ ఆపన్నులను ఆదుకోవడానికి.. అన్నార్తుల ఆకలి తీర్చడినికే వెచ్చిస్తూ.. సేవాసంపన్నుడయ్యారాయన.
ఒక్కగానొక్క కుమార్తె అనారోగ్యం, అత్తింటి వేధింపులు.. ఆ బాధలతోనే ఆమె అకాలమరణం సీవీఎన్ మూర్తి అనే ఈ సేవామూర్తికి అంతులేని విషాదం మిగిల్చినా.. వయసు మీద పడి వెనక్కిలాగుతున్నా.. ఆయన సేవాప్రస్థానం నిరంతరాయంగా సాగుతోంది. అభాగ్యులకు సేవల్లోనే తన కుమార్తెను చూసుకుంటున్నారు. వార్థక్యం వయసుకే కానీ.. మనసుకు కాదని, మనసుంటే అది సంకల్పించుకుంటే.. ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తున్న మహామనీషి.. దైవం మానుష రూపేణా.. అన్న పదబందానికి రూపమిస్తే.. ఆ రూపమే సీవీఎన్ మూర్తిగా మనముందు నిలుస్తుందేమో.. కుడిచేత్తో ఇచ్చిన విషయం ఎడమ చేయికి సైతం తెలియకూడదన్నట్లు తాన సేవా కార్యక్రమాల గురించి ఏనాడూ ప్రచారం కోరుకోకపోయినా.. ఆయన దానశీలత, ఉదారత సమాజంలో మరికొందరికైనా స్ఫూర్తినిస్తుందన్న ఆశతో ‘సత్యం’ అందిస్తున్న కథనం..
కుటుంబంలో కుదుపులు
ఉన్నత ఉద్యోగం, వేల రూపాయల జీతం, చిన్న కుటుంబం.. ఇన్ని సానుకూలతల మధ్య సుఖప్రదంగా సాగాల్సిన ఆయన కుటుంబాన్ని ఊహించని ఆటుపోట్లు కుదిపివేశాయి. మూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. కానీ కుమార్తె నాగజ్యోతి మాత్రమే మిగిలింది. ఆమె సంసార జీవనం, వ్యక్తిగత అనారోగ్యమే మూర్తి కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా కుంగదీశాయి. 1971లో జన్మించిన నాగజ్యోతికి ముద్దుగా చూసుకొని.. యుక్తవయసు రాగానే ఘనంగా వివాహం కూడా జరిపించారు. అయితే అత్తింట ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. చాలాసార్లు పెద్దల సమక్షంలో సంప్రదింపులు జరిగినా ఫలితం లేకపోయింది. విడాకుల వరకు వెళ్లింది. దాంతో కుమార్తెను మూర్తి దంపతులు తమ ఇంటికే తెచ్చేసుకున్నారు. నాగజ్యోతికి అనారోగ్యం రూపంలో మరో పెనుకష్టం ఎదురైంది. శరీరంలో అవసరానికంటే చాలా ఎక్కువ రక్తం ఉత్పత్తి అయ్యేది. దీని వల్ల నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో హెమటాలజీ అంటారు. దీనికి చికిత్స కోసం విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎప్పటికప్పుడు ఆమె శరీరం నుంచి రక్తం తీయాల్సి వచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసిన నాగజ్యోతి మూర్తి దంపతులకు దక్కలేదు. వారిని వదిలి వేరే లోకానికి వెళ్లిపోయింది.
నాగజ్యోతి రూపమే సేవాస్వరూపమై..

ఉద్యోగ విరమణ, కుమార్తె నిష్క్రమణ దాదాపు ఒకే సమయంలో జరగడం మూర్తి దంపతులను వైరాగ్యంలోకి నెట్టేసింది. దాన్నుంచే సేవా సంకల్పం పుట్టింది. వృద్ధాప్యంలో ఏ తోడూ లేని తమకు డబ్బు, ఆస్తులతో పనేముంది. వాటిని ఆర్తులకు అందిస్తే బాగుంటుందని తలచారు. కుమార్తె నాగజ్యోతి స్మృతిచిహ్నంగా సీవీ నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీని స్థాపించి దానధర్మాలు, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. ఏ సమయంలో ఎవరు తలుపుతట్టినా.. లేదనకుండా ధన, వస్తు రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు.
అత్తగారి ఆస్తీ ఆపన్నులకే..
కుటుంబ పోషణకు తండ్రి చేసిన అప్పులను ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి తీర్చేశారు. దాంతో జీతం తప్ప మూర్తికి వేరే ఆస్తులు లేవు. అయితే మేనమామ కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్న ఆయనకు సహధర్మచారిణి తరఫున కొంత ఆస్తి సంక్రమించింది. అత్తగారి నుంచి అందిన రెండంతస్తుల ఇంటిలో పై అంతస్తును అద్దెకిచ్చి.. కింది భాగంలో నివాసముంటున్న మూర్తికి నెలకు రూ.1.22 లక్షల పెన్షన్ అందుతోంది. పెన్షన్‌లో ఓ పదివేలు, పై అంతస్తుకు వచ్చే అద్దె తమ కుటుంబ నిర్వహణకు ఉంచుకునేవారు. మిగిలిన పెన్షన్ ఇతరత్రా ఆదాయాలను వితరణ కార్యక్రమాలకే ధారబోశారు. భర్త సేవా కార్యక్రమాలకు పద్మావతి ఏనాడూ అభ్యంతర చెప్పకపోగా.. నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తూ నిజమైన సహధర్మచారిణి అనిపించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె తన ఒంటిపైనున్న నగలను సైతం అప్పటికప్పుడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఇవ్వడం వారి దాతృత్వానికి నిదర్శనం.
చేతికి ఎముక లేదు
మూర్తిగారి చేతికి ఎముకలేదని.. ఆయన దాతృత్వం గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన ఇచ్చిన విరాళాలు, చేపడుతున్న అన్న, వస్త్రదానాల చిట్టా తయారుచేస్తే చాంతాడంత అవుతుంది. తెలిసినంత వరకు వాటిలో కొన్నింటి వివరాలు..
కలెక్టరేట్ సమీపంలో అనాధాశ్రమంలో మొదట అనురాగ నిలయం పేరుతో చిన్నపిల్లల వసతి కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే వృద్ధులకూ అక్కడే వసతి కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న రెడ్‌క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహనరావు వంటి ప్రముఖుల సూచనతో సీవీఎన్ మూర్తి ఆ బృహత్తర కార్యక్రమానికి ముందుకొచ్చారు. తన ఇంటి పక్కనే ఉన్న సొంత స్థలాన్ని అమ్మగా వచ్చిన సుమారు రూ.70 లక్షల మొత్తాన్ని నేరుగా చెక్కురూపంలో అందజేసి అనాధ వృద్ధులకు ఆనందనిలయం పేరుతో ఆశ్రయం కల్పించడంలో సహకరించారు.
రెడ్‌క్రాస్ ద్వారా ప్రతిరోజూ సుమారు 100 నుంచి 120 మంది అభాగ్యులకు అన్నదానం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న వితరణకు నెలనెలా తనకు అందే పెన్షన్ మొత్తం నుంచి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు చెక్కు రూపంలో అందించారు.
కోవిడ్ కరాళనృత్యం చేస్తున్న సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్న సుమారు ఆరు నెలలపాటు ప్రతిరోజూ 300 నుంచి 400 మందికి భోజనం సమకూర్చారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి జిల్లాకు తరలివచ్చిన సుమారు 60వేల మంది వలసకూలీల ఆకలి తీర్చారు.
ఏటా శీతాకాలంలో ఒకరోజు వందలాదిమంది యాచకులకు దుప్పటి, పంచె, చొక్కా, చీర తదితరాలతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఏడాది కూడా పది రోజుల క్రితమే దత్తాత్రేయ జయంతి రోజున 180 మందికి అన్న, వస్త్రదానం చేశారు.
కోవిడ్ మృతులను అంతిమ సంస్కారాలకు సరైన వాహనం లేని పరిస్థితుల్లో ఒక అంబులెన్స్‌ను రూ.2 లక్షలతో కోవిడ్ నిబంధనలననుసరించి మృతుల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేసి రెడ్‌క్రాస్‌కు అందించారు.
కరోనా సేవలకు రెడ్‌క్రాస్ తరఫున పని చేసిన ఉద్యోగులకు నిధుల లేమితో జీతాలు ఇవ్వడం కష్టమైన పరిస్థితుల్లో లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు.
హెచ్‌ఐవీ బాధితులకు, లెప్రసీ కాలనీవాసులకు, క్యాన్సర్ రోగులకు తరచూ అవసరమైన ఆర్థిక, వస్తు సాయం అందజేస్తుంటారు.
కేరళకు చెందిన అయ్యప్ప ఆరాధకుడు చంద్రమౌళీశ్వరస్వామికి రూ.లక్ష విరాళమిచ్చారు.
2019లో రెడ్‌క్రాస్ ప్రతినిధి నిక్కు అప్పన్న మాస్టారి ఆధ్వర్యంలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలకు ఆయన అభిమానిగా మూర్తి భూరి విరాళం ఇచ్చారు.
నాలుగుసార్లు గవర్నర్ మెడల్స్
నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ ద్వారా రెడ్‌క్రాస్ కార్యకలాపాలకు, ఇతర సేవా కార్యక్రమాలకు విరివిగా విరాళాలిస్తున్న మూర్తిని రెడ్‌క్రాస్ గవర్నర్ మెడల్స్ నాలుగుసార్లు వరించాయి. గత ముఖ్యమంత్రుల రోశయ్య, చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్ తదితరులు శ్రీకాకుళం పర్యటనలో మూర్తిని స్వయంగా కలిసి.. ఆయన సేవలను ప్రశంసించారు.
Comments