top of page

హస్తినాపురిలో ‘రాము’లోరి మంత్రాంగం

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 27
  • 3 min read
  • సామాజిక న్యాయశాఖామంత్రితో 5 కులసంఘాలు భేటీ

  • ఓబీసీ కోసం ఒక్క తాటిపైకి తెచ్చిన కేంద్రమంత్రి

  • పార్లమెంట్‌ హాల్‌లో సమావేశం

  • కృషి ఫలిస్తే చరిత్రకెక్కనున్న రామ్మోహన్‌నాయుడు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వయసు చిన్నదైనా కేంద్రంలో ఉన్నతమైన మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండటమంటే చిన్నవిషయం కాదు. వారసత్వం ఉన్నంత మాత్రాన వ్యాధులు సంక్రమిస్తాయేమో గానీ పదవులు అయాచితంగా రావు. ఒక సక్సెస్‌ రావాలంటే కన్నీరు పెట్టుకోవాలి.. కష్టాలు ఎదుర్కోవాలి.. బాధలు తట్టుకోవాలి.. మనసుకు గాయాలు కావాలి.. మాటలకు గుండె ముక్కలు కావాలి.. ఎదురుదెబ్బలు తినాలి.. బంధాలను కోల్పోవాలి.. సహనంతో మెలగాలి.. గుణపాఠాలు నేర్చుకోవాలి.. తప్పులు దిద్దుకోవాలి.. అన్నిటికంటే మించి నీతో నువ్వు యుద్ధం చేయాలి. పోకిరి సినిమాలో మహేష్‌బాబు అన్నట్టు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా? లేదా? అన్నదే ఇప్పటి బతుకు సూత్రం. ఈతరం రాజకీయాలకు ఈ కాలం నాయకుడు ఎలా ఉండాలి అనే ప్రశ్న వస్తే కచ్చితంగా దేశంలో ఓ డజను పేర్లు వినిపిస్తాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే.. ఆయన చేస్తున్నది రాజకీయమని ఆయనకే తెలియనంతగా మమేకమైన పనితీరు రామ్మోహన్‌ది. అందుకు ఒక తాజా ఉదాహరణ చూద్దాం.

ప్రస్తుతం ఢల్లీిలో శిష్టకరణ, కళింగకోమటి, తూర్పుకాపు, సొండి, అరవ సామాజికవర్గాలకు చెందిన కుల సంఘాల నేతలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి బీరేంద్రకుమార్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ద్వారా పార్లమెంట్‌ హాల్‌లో కలవనున్నారు. ఈ కులాలను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని ఓ వినతిపత్రం ఇవ్వడంతో పాటు అందుకు గల అవసరాన్ని కేంద్రమంత్రికి వివరించనున్నారు. అసలు సంబంధిత మంత్రితో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది రామ్మోహన్‌నాయుడే. దేశంలోనే అత్యున్నత సభ పార్లమెంట్‌ సమావేశ మందిరంలో ఈ కులసంఘ నేతలతో మంత్రిని భేటీపర్చడం రాష్ట్ర చరిత్రలోనే ప్రముఖ ఘట్టం. గతంలో అనేకమార్లు తమను ఓబీసీలో చేర్చాలని ఎన్‌సీబీసీకి అనేక కుల సంఘ నేతలు అనేక పార్టీల తరఫున కలవడం, తమ వాణిని వినిపించడం అందరితీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఐదు కుల సంఘాలు మాత్రమే తమను ఓబీసీలో చేర్చమని మంత్రి బీరేంద్రకుమార్‌ను అడుగుతున్నాయంటే దాని వెనుక రామ్మోహన్‌ నాయుడు మంత్రాంగం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో బీసీగా నోటిఫై అయి కేంద్రంలో ఓబీసీ కాని కులాలు 29 ఉన్నాయి. అందులో కేవలం ఈ ఐదు కుల సంఘాలకు మాత్రమే పిలుపు రావడం వెనుక రామ్మోహన్‌నాయుడు ఎత్తుగడ కనిపిస్తుంది. ఒక్క అరవల సామాజికవర్గం మినహా మిగిలిన నాలుగు కుల సంఘాల్లోనూ గ్రూపులు ఉన్నాయి. వీరందర్నీ ఒక్క తాటిమీదకు తెచ్చి ఒక్క మాట మాత్రమే మంత్రికి చెప్పాలని రామ్మోహన్‌ నాయుడు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే గురువారం ఉదయం నాటికి అందరూ ఢల్లీి చేరుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ ఐదు కులాలు కలిపి దాదాపు నాలుగు లక్షల మంది ఉంటారు. ఇప్పుడు వీరిని ఓబీసీలో చేర్చడం ద్వారా కాళింగులకు బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎలాగో, ఈ ఐదు కులాలకు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అంతే అన్న స్థాయికి ఎగబాకనున్నారు. దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్‌ నివేదిక మేరకు బీసీలైనవారిలో తూర్పుకాపులు కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే ఓబీసీలుగా ఉన్నారు. కానీ వీరి బంధువులు, ఉత్తరాంధ్ర నుంచి మిగతా ప్రాంతాలకు విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిపోయిన వారు ఇప్పటికీ ఓబీసీలు కాలేదు. ఇప్పుడు వీరిని కూడా ఓబీసీలు చేయాలని రామ్మోహన్‌ నాయుడు పట్టు పడుతున్నారు. మొదట్లో ఈ పనిని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు టేకప్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆయన పేరు వినిపించడంలేదు. ఇక జిల్లాలో ఉన్న పొందర్లు ఉత్తరాంధ్రలో బీసీలు కాకముందే కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో ఉన్నారు. ఇక మిగిలింది కళింగకోమట్లు, శిష్టకరణాలు, అరవలు, తూర్పుకాపులు మాత్రమే. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కళింగకోమట్లు, శిష్టకరణాలు, అరవలు తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం, అసలు టిక్కెటిచ్చే పార్టీలు లేకపోవడం వల్ల ప్రతీ ఎన్నికల్లోనూ వేవ్‌ను అనుసరించి వీరి ఓటుబ్యాంకు చీలిపోతుంది. అలా కాకుండా వీరిని ఓబీసీలో చేర్చడం ద్వారా గంపగుత్తగా పార్లమెంట్‌ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఓట్లు రాబెట్టుకోడానికి రాము అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది. జాతీయ బీసీ కమిషన్‌ ముందు శ్రీకాకుళంలో వెనుకబడిన కులాలు తమ వాదనను వినిపించే అవకాశాన్ని కూడా గతంలో రామూయే కల్పించారు. అయితే అప్పుడు వెళ్లిన కులసంఘ నేతలు పార్టీలవారీగా విడిపోవడంతో బీజేపీ ఎంపీలను పట్టుకొని వైకాపాతో అనుబంధం ఉన్న కులసంఘాలు, రామును కలుపుకొని టీడీపీతో అనుబంధం ఉన్న కులసంఘాలు ఎన్‌సీబీసీ చైర్మన్‌ను కలిశాయి. అయితే ఈసారి వైకాపాకు అడ్రస్‌ లేకపోవడంతో మిగిలిన మూడు పార్టీలు ఒకే గొడుగు కింద ఉండటంతో కుల సంఘాలన్నీ రాము నేతృత్వంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే అందరూ కలిపి ఒకే వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు కోసం 29 కులాలు ఎదురుచూస్తున్నా ఈ ఐదు కులాలను చేర్చడం కోసం రాము చేస్తున్న యత్నం ఫలిస్తే రాము మంత్రాంగం నెరవేరినట్లే.

రాముకు రుణపడివుంటాం

తమను ఓబీసీలో చేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు రుణపడివుంటామని జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు (వాసు) పేర్కొన్నారు. గురువారం ఢల్లీి నుంచి ‘సత్యం’తో మాట్లాడిన ఆయన కేంద్ర సామాజిక న్యాయశాఖామంత్రితో కలిసే అవకాశం తమకు ఎప్పటికీ రాదని, అటువంటి సందర్భాన్ని సృష్టించి, అక్కడ జిల్లాలో బీసీల తరఫున మాట్లాడే అవకాశాన్ని కల్పించిన రామ్మోహన్‌ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page